వర్గల్, డిసెంబర్ 7: వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయాన్ని కలెక్టర్ మనుచౌదరి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నవోదయ ప్రిన్సిపాల్‌తో కలిసి వసతి గృహాలను, డైనింగ్ హాల్, స్టోర్, కిచెన్ షెడ్లను పరిశీలించారు. కాలం చెల్లిన పదార్థాలను వాడరాదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. విద్యాలయం పాత భవనం కావడంతో చిన్నచిన్న రిపేర్లు ఉన్నాయని బాగు చేయించాలని, విద్యార్థుల వైద్యసేవల నిమిత్తం ఒక వెహికల్‌ను ఏర్పాటు చేయాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం క్లాస్రూంలకెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ములుగు, డిసెంబర్ 7: విద్యార్థులు పట్టుదలతో చదివి బంగారు భవితకు బాటలు వేసుకోవాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. శనివారం ములుగులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రతి అంశంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సమయాన్ని వృథా చేయకుండా ఏకాగ్రతతో చదవాలని సూచించారు. అనంతరం పాఠశాలలో సమస్యలను ప్రిన్సిపాల్ వివరించగా వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పుష్పలత, ఉపాధ్యాయులు ఉన్నారు.