సిద్దిపేట, డిసెంబర్ 26: వంద శాతం పన్నుల వసూలే లక్ష్యంగా బల్దియా అధికారులు ముందుకు సాగుతున్నారు. 2023-24 సంవత్సరానికి బల్దియా పన్నుల వసూళ్ల లక్ష్యం, పాత బకాయిలతో కలిపి రూ.15కోట్ల 37లక్షల 92వేలు కాగా, ఇప్పటి వరకు రూ.9కోట్ల 13లక్షలు78లక్షలు పన్ను వసూలు చేశారు. ఇప్పటి వరకు మొత్తంగా 59.42 శాతం పన్నుల వసులు చేసినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట పట్టణంలో మొత్తం పన్నుల వసూళ్ల అసెస్మెంట్లు 34,180 ఉండగా వాటిని మూడు కేటాగిరిలుగా విభజించారు. సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.11కోట్ల 99లక్షల 45వేలు పన్నుల వసూలు లక్ష్యం కాగా, గత సంవత్సరం బకాయిలు రూ.3 కోట్ల 38లక్షల 47వేలతో కలిపి మొత్తంగా రూ.15కోట్ల 37లక్షల 92వేల పన్నుల వసూలు లక్ష్యం ఉంది. ఈ నెల 18 వరకు 2023-24కు చెందిన పన్ను రూ.8కోట్ల 83లక్షల 59వేలు, పాత బకాయిలకు సంబంధించిన వాటిలో రూ.3కోట్లు 19 లక్షలను అధికారులు వసూలు చేశారు. మార్చి 2024 నాటికి పన్నుల వసూళ్లకు చివరి తేదీ ఉండటంతో మున్సిపల్ అధికారులు లక్ష్యాన్ని చేరుకునే దిశగా సాగుతున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3 కోట్లు15లక్షల 86వేలు, బకాయిలు రూ.3కోట్ల 8లక్షల28వేలతో మొత్తంగా ఇంకా రూ.6 కోట్ల 24లక్షల 14వేలను వసూలు చేయాల్సి ఉన్నది. మున్సిపాలిటీలో విభజించిన కేటగిరిల వారీగా మొదటి కేటాగిరిలో నివాసాలు, నివాసేతర సముదాయాలు, మిక్స్డ్ అసెస్మెంట్లు మొత్తంగా 34098 ఉన్నాయి. ఈ కేటగిరిలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.11కోట్ల 30లక్షల 65వేలు, బకాయిలు రూ. కోటి 12లక్షల 74వేలతో కలిసి మొత్తం రూ.12కోట్ల 43లక్షల 39వేలు వసూలు చేయాల్సి ఉన్నది. కాగా, ఇప్పటి వరకు రూ.8 కోట్ల 86లక్షల 71వేల మేర పన్నులు వసూలు చేయగా, ఇంకా రూ.3కోట్ల 56లక్షల 68వేలు వసూలు చేయాల్సి ఉన్నది. మొత్తంగా మొదటి కేటగిరిలో 71.31శాతం మేర పన్నులు వసూలు చేశారు. రెండో కేటగిరిలో ప్రభుత్వ కార్యాలయాలు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు) సంబంధించినవి 82 అసెస్మెంట్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన పన్నుల వసూళ్ల డిమాండ్ రూ.29కోట్ల 4లక్షల 53వేలు ఉండగా, వీటిలో ఇప్పటి వరకు రూ.2కోట్ల 7లక్షల 7వేలు వసూలు చేశారు. రూ.26కోట్ల 7లక్షల 46 వేలు వసూలు చేయాల్సి ఉంది.
సిద్దిపేట మున్సిపాలిటీలో ఈ ఆర్థిక సంవత్సరంలో 100శాతం పన్నుల వసూలే లక్ష్యంగా మున్సిపల్ సిబ్బంది పనిచేస్తుంది. పన్నుల వసూళ్ల డిమాండ్‌కు అనుగుణంగా ఇప్పటి వరకు 59.42శాతం పన్నుల వసూలు చేశాం. నివాస, నివాసేతర, కమర్షియల్ కేటాగిరిలో 71.31శాతం మేర పన్నులను వసూళ్లు చేశాం. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తియ్యే నాటికి పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేస్తాం.