
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 7 : జిల్లా పరిధిలోని ప్రధాన రహదారులన్నీ హరితశోభితం కావాలని, రాజీవ్ రహదారి మల్టీ లేయర్ ప్లాంటేషన్‌ను తెలంగాణకే మోడల్‌గా నిలపాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్లో ఎంఎస్‌వోలు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఫారెస్ట్ అధికారులు, ఎంపీవోలు, ఏపీవోలు, ఈసీలు, టీఏలు, పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిధిలోని రాజీవ్ రహదారి, భువనగిరి, సిరిసిల్ల రోడ్డుల్లో ఇరువైపులా మూడు వరుసల మొక్కలు నాటే పనుల పురోగతి, చనిపోయిన మొక్కల స్థానం లో కొత్తవి నాటడం, గ్యాప్ ప్లాంటేషన్ పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కింద చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్‌లో జిల్లా మంచి ఫలితాలు సాధించినప్పటికీ, రహదారుల వెంబడి కొన్ని స్ట్రెచ్‌లో సంతృప్తి స్థాయిలో లేదన్నారు. జిల్లా పరిధిలో ఉన్న రాజీవ్హ్రదారి, సిరిసిల్ల, తుప్రాన్, జగదేవ్‌పూర్, భువనగిరి రహదారుల వెంబడి ఇరువైపులా మూడు, నాలుగు వరుసల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాల్సి ఉందన్నారు. గ్రామ పంచాయతీల వారీగా రాజీవ్ రహదారి వెంబడి పెట్టాల్సిన మొక్కలు, మంజూరైన మొక్కలు, పెట్టిన మొక్కలు, చనిపోయిన మొక్కలు వాటి స్థానంలో పెట్టాల్సిన మొక్కల సమగ్ర సమాచారం ఫారెస్ట్, సంబంధిత శాఖల అధికారుల వద్ద ఉండాలన్నారు. ఆయా గ్రామ పరిధిలోని మంజూరైన లేబర్ మ్యాన్ డేట్లు, ఇప్పటి వరకు ఎంత మందిని వాడుకున్నామో, ఖర్చులు, పెండింగ్ బిల్లుల వివరాలు ఉండాలన్నారు. వర్కర్లకు, వాచర్లకు బిల్లుల చెల్లింపు వేగంగా చేయాలని అధికారులకు సూచించారు. వానకాలం పూర్తవుతున్న దృష్ట్యా మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీటిని పట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
రాజీవ్ రహదారి జంగిల్ క్లియరెన్స్‌కు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి
సిద్దిపేట జిల్లా పరిధిలోని రాజీవ్ రహదారి జంగిల్ క్లియరెన్స్‌కు నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. 5 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. డ్రైవ్ వేజ్ ఎంప్లాయిమెంట్ బాధ్యతను ఎంపీడీవో, ఏపీవోలు తీసుకోవాలన్నారు.
డివైడర్ మధ్య మొక్కలు నాటే బాధ్యత అటవీ అధికారులదే..
రాజీవ్ రహదారి డివైడర్ మధ్యలో మొక్కలు నాటే బాధ్యత అటవీ అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. రాజీవ్ రహదారి వెంబడి డివైడర్ మధ్యలోని గ్యాప్‌ల్లో నాటేందుకు 14 వేల మొక్కలు అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు. అవసరమైన మొక్కలు, మట్టిని అటవీ శాఖకు తాము అందిస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, శిక్షణ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి బి.చెన్నయ్య, డీఎఫ్‌వో శ్రీధర్, జడ్పీ సీఈవో రమేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.