
చేర్యాల, జూలై 5 : తాటాకు చప్పుళ్లకు భయపడబోనని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోలీసులను అడ్డుపెట్టుకొని భయపడి కారు ఎక్కి పారిపోయాడని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భా గంగా మున్సిపాలిటీ పరిధిలోని నాల్గో వార్డులో నిర్మించిన నూతన మరుగుదొడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ కొనుగోలు చెత్త సేకరణ ఆటోలను మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వంగా చంద్రారెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మార్కెట్ కమిటీ పాలకవర్గం చైర్మన్ సుంకరి మల్లేశం ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, డైరెక్టర్లు ఎమ్మెల్యేను సన్మానించగా, మార్కెట్ ఆవరణలో ఎమ్మెల్యే మొక్క నాటారు. అనంతరం జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు.
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వార్డుల్లో పర్యటించి మొక్కల పెంపకం, పారిశుధ్యంపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే కబ్జాలు చేశాడని ప్రజలు తిరస్కరించినా, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు తాను జనగామను కబ్జా చేశానని చెప్పారు. పట్టణంలోని వెంచర్లలో బోర్డులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారుల ను ఆదేశించారు. 30 ఫీట్ల రోడ్లు లేని వెంచర్లకు అనుమతి ఇవ్వొద్దని, సెట్ బ్యాక్ కాకుండా నిర్మాణాలు చేపడితే వాటిని తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్, పచ్చిమడ్ల సతీశ్, జుబేదా ఎక్బాల్, మంగోలు చంటి, ఉడుముల ఇన్నమ్మ, తుమ్మలపల్లి లీలా, ముస్త్యాల తార, చెవిటి లింగం, సందుల సురేశ్, కోఆప్షన్ సభ్యులు ఆరోగ్యరెడ్డి, ముస్త్యాల నాగేశ్వర్రావు, విజయలక్ష్మి, మల్లన్న ఆలయ డైరెక్టర్లు, నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, ముస్త్యాల కిష్టయ్య, గోనె హరి పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణతో గ్రామాభివృద్ధి
మండలంలోని మేజర్ పంచాయతీ ఆకునూరులో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు విస్తరణ పనులతో గ్రామం మరింత అభివృద్ది చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని ఆకునూరు గ్రామంలో పంచాయతీ వద్ద ఎమ్మెల్యే మొక్క నాటి, పారిశుధ్య పనులు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా రహదారి విస్తరణలో భాగంగా ఇంటి యజమానులతో మాట్లాడి పనులు ప్రారంభించారు. రోడ్డు విస్తరణతో ఇండ్లు కోల్పోయిన వా రిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే హామీనిచ్చారు. ఎమ్మెల్యే వెంట మార్కె ట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం, సర్పంచ్ చీపురు రేఖమల్లేశం, ఉపసర్పంచ్ బోయి ని పద్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుతు అనంతుల మల్లే శం, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ పుప్పా ల మహేందర్, టీఆర్ఎస్వీ మండల ఉపాధ్యక్షుడు తాటికొండ సదానందం పాల్గొన్నారు.