గజ్వేల్, అక్టోబర్ 29: ఆర్టీసీ బస్సులో ప్రయాణం అం టే నరకప్రాయంగా మారింది. ఒకప్పుడు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ చిరునామాగా నిలిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక మహాలక్ష్మి పథకం ప్రారంభించడంతో ప్రయాణానికి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. సామాన్య ప్రజానీకం దూరప్రాంతాలకు వెళ్ల్లాలంటే ప్రధానంగా ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తారు. ఎంత దూరమైనా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అన్నివిధాలుగా అనుకూలంగా భావిస్తారు. కానీ, మహాలక్ష్మి పథకం అమలు తర్వాత మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసి పోతున్నాయి. పరిమితికి మించి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సీట్లు దొరకడం గగనంగా మారింది. బస్సు ఏ డిపో నుంచి ప్రారంభమవుతుందో అక్కడే పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అవుతున్నాయి.
ఇక ముందుకు వెళ్ల్లేకొద్ది స్టేజీల వద్ద బస్సు ఆగినప్పుడు ఎక్కే ప్రయాణికులు ఎంత దూరమైన నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తున్నది. నిత్యం ఆర్టీసీ బస్సులో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రతి బస్సులో 90శాతం వరకు మహిళలే ప్రయాణిస్తున్నారు. ఉదయం సమయంలో ఉద్యోగులు, దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే వాళ్లు ప్రయాణం చేయాలంటే విసుగుకుంటూ ఇదేమి ఉచిత బస్సు ప్రయాణం అం టూ పెదవి విరుస్తున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో తెలంగాణలోని మహిళలందరినీ అర్హులుగా ప్రభుత్వం ప్రకటించడంతో చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ఇక సెలవు దినాలు, పండుగ రోజుల్లో ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నది. పరిమితికి మించి బస్సులో ప్రయాణికులు ఎక్కుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. లోడ్ భరించక ఇప్పటికే పలుచోట్ల బస్సు టైర్లు ఊడిపోయిన ఘటనలు జరిగాయి. అంతేకాకుండా బస్సుల నిర్వహణ పట్టించుకోక పోవడంతో కండీషన్ లేక ఎక్కడపడితే అక్కడ బస్సులు ఆగిపోతున్నాయి.
ఏ బస్సు చూసినా…
ప్రజ్ఞాపూర్ బస్టాండ్ వద్ద ఉదయం, సాయంత్రం సమయంలో వందలాది మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రతి బస్సు అక్కడి నుంచే ఫుల్‌గా వస్తుంది. అదే విధంగా భువనగిరి వెళ్లే బస్సుల్లో అదే పరిస్థితి కనిపిస్తున్నది. మహిళలు ఎక్కువగా దేవాలయాలకు వెళ్తుతున్నారు. ఆదివారం కొమురవెల్లి, నాచారం, యాదాద్రి, స్వర్ణగిరికి వెళ్తున్నారు. తిరుగు ప్రయాణంలో ప్రతిఒక్కరూ బస్సులో సీటు దొరక్క అలసిపోతూ కనిపిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ప్రతి బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో కండక్టర్‌కు తలనొప్పిగా మారుతున్నది.
డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు హైదరాబాద్‌కు సిద్దిపేట, వేములవాడ, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, దుబ్బాక, హుస్నాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ఉట్నూ ర్, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నుంచి వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎన్ని ట్రిప్పులు తిరిగినా ప్రయాణికులకు మాత్రం సీటు దొరకడం పెద్ద సవాల్‌గానే మారింది. మహాలక్ష్మి పథకంలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆర్టీసీ గొప్పలకు పోతున్నది.
కానీ, పండుగలు, ప్రత్యేక రోజుల్లో స్పెషల్ బస్సుల పేరిట రోజువారీగా నడిచే బస్సులనే తిప్పుడూ అధిక చార్జీలు వసూలు చేస్తున్నదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు రద్దీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బడికి, కళాశాలకు వెళ్లడానికి బస్సులు ఫుల్‌గా వస్తుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బస్సుల్లో ప్రయాణికులు ఎక్కువ కావడంతో కొన్ని స్టేజీల వద్ద ఆపకుండానే వెళ్తుండడంతో విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీనిపై పలుచోట్ల విద్యార్థులు ఆందోళనలు సైతం చేస్తున్నారు.