రాయపోల్, డిసెంబర్ 1: ప్రమాదాలకు గురైన బాధితులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి 108 అంబులెన్స్ లేక సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ప్రతి మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు దాని పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తుంది. గతంలో ఉమ్మడి దౌల్తాబాద్‌కు అంబులెన్స్ కేటాయించారు. ఏడేండ్ల క్రితం రాయపోల్ మండలం ఏర్పడినా ఇంతవరకు అంబులెన్స్ కేటాయించలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాయపోల్ మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉండగా 22వేల జనాభా ఉన్నది. 19 గ్రామ పంచాయతీల పరిధిలో మూడు మధిర గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని ప్రజలు ప్రమాదాలు, అనారోగ్యానికి గురైనప్పుడు వారిని దవాఖానకు తరలించాలంటే పక్క మండలాల నుంచి అంబులెన్స్ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కోసారి అక్కడ కూడా అంబులెన్స్ లేనప్పుడు ప్రజల ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో స్థానిక ప్రాథమిక అరోగ్య కేంద్రంలో అంబులెన్స్ సౌకర్యం లేక ప్రైవేట్ వాహనాల ద్వారా దవాఖానకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
రాయపోల్ మండల కేంద్రంలో ఇటీవల మూలుమలుపు వద్ద ఆటో బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. 108కు ఫోన్ చేసినా గంట వరకు రాలేదు. దీంతో క్షతగాత్రులను ఆటోలోనే తరలించారు. అత్యవసర సమయంలో రోగులను గజ్వేల్, హైదరాబాద్ దవాఖానలకు తరలించడానికి అంబులెన్స్ లేక ప్రైవేట్ వాహనాల్లో తీసుకువెళ్లాల్సి వస్తున్నదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే రాయపోల్ మండలానికి 108 అంబులెన్స్ కేటాయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.