నర్సాపూర్, మార్చి15: వన్యప్రాణాలను హతమార్చేందుకు నాటు తుపాకులతో తిరుగుతున్న ఎనిమిది మంది వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఎఫ్ఆర్ఓ అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ మండలం నత్నాయిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను నాటు తుపాకీలతో వేటాడేందుకు ప్రయత్నిస్తున్న బొంతపల్లి, షేర్ఖాన్పల్లి, నత్నాయిపల్లి, హత్నూరా గ్రామాలకు చెందిన ఎనిమిది మంది ముఠా సభ్యులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మూడు నాటు తుపాకులు, ఒక కత్తి, గన్ పౌడర్లను స్వాధీనం చేసుకున్నారు.
ముఠా సభ్యులపై తెలంగాణ అటవీ చట్టం -1967, వన్యప్రాణుల చట్టం-1972 క్రింద కేసు నమోదు చేశారు. నిందితులను నర్సాపూర్‌లోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించామని ఎఫ్ఆర్ఓ అరవింద్ తెలిపారు. ఈ కేసులో బొంతపల్లి వాసులు యాసిన్, కృష్ణ, శంకరయ్య, వీరస్వామి, నత్నాయిపల్లి గ్రామ నివాసులు శ్రీకాంత్, విజయ్, భానుప్రసాద్, హత్నూరా వాసి పోచయ్యలను నిందితులుగా గుర్తించారు. ఈ దాడుల్లో సెక్షన్ ఆఫీసర్ సాయిరాం, బీట్ ఆఫీసర్ గోపాల్‌రెడ్డి, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.