దుబ్బాక, జనవరి 18: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శనివారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. దుబ్బాక పట్టణంలో టీయూఎఫ్ఐడీసీ, పట్టణ ప్రగతి నిధుల ద్వారా రూ.40 లక్షలతో నిర్మించిన చిల్ట్రన్ పార్కును, రూ.73 లక్షలతో నిర్మించిన మానవ ఘన వ్యర్థాల శుధ్ధీకరణ (ఎఫ్ఎస్టీపీ) కేంద్రాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి, గ్రామసభల్లో వారికి అధికారులు ఎంపిక పత్రాలు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దుబ్బాకలో పోలీసుల అత్యుత్సాహం
దుబ్బాక పట్టణంలో పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆ పోలీసు అధికారి బహిరంగంగానే బీఆర్ఎస్ కార్యకర్తపై చేయి చేసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం దుబ్బాకలో పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి, ఎమ్మెల్యేలు వేర్వేరుగా తమ వాహనాల్లో బయలుదేరారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డికి పోలీసులు కాన్వాయ్ కల్పించలేదు. దీంతో ఎమ్మెల్యేకు దారి చూపించేందుకు స్థానిక బీఆర్ఎస్ కార్యకర్త పడాల నరేశ్ తన కారు ముందు నడిపిస్తూ వచ్చాడు. ఈ విషయంపై దుబ్బాక సీఐ శ్రీనివాస్ ఆవేశంతో వచ్చి నరేశ్‌పై చేయి చేసుకున్నాడు. కొంత సమయానికి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి సీఐ శ్రీనివాస్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలను వేరువేరుగా చూడొద్దని పోలీసులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి పోలీసు అధికారులు కార్యకర్తలుగా పనిచేయవద్దని, సక్రమంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. శనివారం ఉదయం నుంచి దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వచ్చిన మంత్రి కొండా సురేఖను గౌరవిస్తూ, ప్రశాంతంగా కార్యక్రమాలు కొనసాగిస్తుంటే, తమ పార్టీ శ్రేణులపై పోలీసులు అత్యుత్సాహం చూపడంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన వివక్ష చూపడం సరికాదని పోలీసులకు ఆయన సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తపై సీఐ బహిరంగంగా చేయి చేసుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.