శివ్వంపేట, అక్టోబర్ 16: అతివేగంగా దూసుకొచ్చిన కారు ఏడుగురు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి బస్టాండ్ సమీపంలోని వాగు బ్రిడ్జి వద్ద బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం..శివ్వంపేట మండలంలోని శంకర్ తండా, సీతారాం తండా, తాళ్లపల్లి తండాకు చెందిన ఎనిమిది మంది సొంత కారులో వర్గల్ మండలం సీతారాంపల్లి తం డాలో జరిగిన శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఉసిరికపల్లి శివారులోని బ్రిడ్జి వద్ద అతివేగంగా వచ్చి అదుపుతప్పి వాగులోని తుమ్మచెట్టుకు బలంగా ఢీకొని వాగులో పడిపోయింది.
విష యం తెలుసుకున్న ఎస్ఐ మహిపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, జేసీబీ సహాయంతో వాగులోని కారును బయట కు తీశారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుకావడంతో మృతదేహాలను తీసేందుకు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. మృతులంతా గిరిజనులే కావడంతో సమీప తండాల ప్రజలు అక్కడికి చేరుకుని బోరున విలపించారు.
మృతులు మండలంలోని తాళ్లపల్లి తం డాకు చెందిన ధనావత్ శివరాం(55), ధనావత్ దుర్గమ్మ(45), జెగ్యాతండాకు చెందిన మాలోత్ అనిత (30), మాలోత్ ఇందు (14), మాలోత్ శ్రావణి (12), భీమ్లా తండాకు చెందిన గుగ్లోత్ శాంతి(45), గుగ్లోత్ మమత(16) ఉన్నారు. మృతుల్లో భీమ్ల తం డాకు చెందిన గగ్లోత్ శాంతి, కూతురు గుగ్లోత్ మమత, తాళ్లపల్లి తండాకు చెందిన భార్యాభర్తలు ధనావత్ శివరాం, ధనావత్ దుర్గమ్మ మృతిచెందడంతో వారి ఆక్రందనలు మిన్నం టాయి. భీమ్లాతండాకు చెందిన డ్రైవర్ నామ్సింగ్కు తీవ్ర గాయాలు కాగా నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.
ఘటనా స్థలాన్ని తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి సందర్శించి, పోస్టుమార్టం కోసం మృతదేహాలను తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణగౌడ్, బీఆర్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి సిలువేరి వీరేశం, మాజీ సర్పంచ్లు, గిరిజనులు తూప్రాన్ దవాఖాన వద్దకు చేరుకున్నారు. మాజీ జడ్పీటీసీ మహేశ్గుప్తా తక్షణ సాయం కింద రూ.25 వేలు అందజేసి వారి కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటానని తెలిపారు.