రామాయంపేట, మార్చి 28: మగ సంతానం కోసం ఓ వ్యక్తి మైనర్‌ను పెండ్లి చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసుల కథనం ప్రకారం… మెదక్ జిల్లా రామాయంపేట మండ లం కాట్రియాల గిరిజన తండాకు చెందిన శివలాల్‌కు ముగ్గురు ఆడపిల్లలు జన్మించడంతో మగ సంతానం కోసం పక్కనే మరో గిరిజన తండాకు చెందిన బాలిక(16)ను పెండ్లి చేసుకున్నాడు.
బాలికను పెండ్లి చేసుకొని పది రోజులు గడుస్తుండడంతో తండాకు చెందిన కొంతమంది మహిళలు ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మెదక్ నుంచి శిశు సంక్షేమ శాఖ అధికారులతో పాటు రామాయంపేటకు చెందిన వివిధ శాఖల అధికారులు కాట్రియాల గిరిజన తండాకు వెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో సంబంధిత వ్యక్తికి ముగ్గురు ఆడ సంతానం ఉండడంతో, మగ సంతానం కోసం మరో అమ్మాయిని పెండ్లి చేసుకున్నట్లు తేలింది. వెంటనే అధికారులు బాలికను మెదక్‌లోని బాలసదనానికి తీసుకెళ్లారు. బాలికను పెండ్లి చేసుకున్న శివలాల్‌పై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ సూపర్వైజర్ భారతి, ఆర్ఐ గౌస్ తెలిపారు.