అల్లాదుర్గం, జనవరి 28: అనర్హులకు పథకాలు అందుతుండడంతో అర్హులు గగ్గోలు పెడుతున్నారు. అర్హులను విస్మరించి ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి, పెండ్ల్లికాని యువతకు, చదువుకుంటున్న విద్యార్థులకు సంక్షేమ పథకాలను మంజూరు చేశారని ఆరోపిస్తూ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. మంజూరైన రెండు రోజుల్లోనే ఎంపికైన లబ్ధిదారులపై మంగళవారం మళ్లీ సర్వే నిర్వహించారు. ఇదంతా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అందోల్ నియోజకవర్గంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి… నాలుగు ప్రభుత్వ పథకాలను అందించడానికి మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ఐబీ తండాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇటీవల సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం సూచించినట్లుగా గణతంత్ర దినోత్సవం 26న లబ్ధిదారులకు పథకాల ప్రొసీడింగ్స్ అందచేశారు.
10 మందికి రేషన్ కార్డులు, 20మంది రైతులకు రైతు భరోసా, 14మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 9మందికి ఇందిరమ్మ ఇండ్ల్లను మంజూరు చేసినట్లు ప్రొసీడింగ్స్ అందజేశా రు. అయితే లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని, అర్హులను వదిలేసి అనర్హులకు పథకాలను మంజూరు చేశారని తండా వాసులు ఆరోపిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు మొర పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి ఐబీ తండాలో పథకాలకు ఎంపికైన లబ్ధిదారుల విషయంలో విచారణ చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తండాలో లబ్ధిదారుల ఎంపికపై విచారణ చేపట్టారు. ఈ విషయమై ఎంపీడీవో చంద్రశేఖర్‌ను వివరణ కోరగా, జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఎంపికైన లబ్ధిదారుల్లో కొందరు అనర్హులు ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు విచారణ నివేదికను అందిస్తామని తెలిపారు.