జహీరాబాద్, డిసెంబర్ 12 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఈనెల 14,17 తేదీల్లో రెండు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల కోసం వలస ఓటర్లపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టిసారించారు. గ్రామం యూనిట్‌గా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. స్వల్ప తేడా ఓట్లతో ఫలితం తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో సర్పంచ్ అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతి ఓటరుపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. నువ్వా..నేనా అన్నట్లు ఓటరు మద్దతు కూడగట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్ది వార్డులు వారి అనుకూల ఓటర్లపై ఆరాతీస్తూ, వారిని ఎలా కలవాలి..? ఎలా తమవైపు తిప్పుకోవాలనే ప్లాన్ చేసుకుంటున్నారు.
విద్య,ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం వివిధ ప్రాంతాల్లో గ్రామ ఓటర్లు ఎంత మంది ఉంటున్నారు..ఎక్కడెక్కడ ఉంటున్నారని ఆరాతీస్తున్నారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు, బూత్ కన్వీనర్లు, ఏజెంట్లు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. గ్రామంలో 100 నుంచి 200 మంది వరకు వలస ఓటర్లు ఉన్నట్లు అంచనా వేసుకుంటూ ప్రత్యేకంగా బృందాలను రంగంలోకి దింపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, పటాన్చెరు, బీదర్ తదితర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఫోన్లు చేస్తున్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే స్వగ్రామాలకు రప్పించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. వారి ఫోన్ నంబర్లు సేకరిస్తూ, వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి వారికి టచ్‌లో ఉంటున్నారు.
ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఒకచోట ఎక్కువ మంది ఉంటే ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకుని రావాలని, లేని పక్షంలో ఇక్కడి నుంచి పంపిస్తామని హామీ ఇస్తున్నారు. ఎంతమంది ఓటర్లు గ్రామాలకు వస్తున్నారో తెలుసుకుని స్వయంగా కలవడమే కాకుండా వీలును బట్టి గోగుల్పే, ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. రవాణా ఖర్చులకు తోడుగా పైఖర్చులు, వలస కూలీలు నష్టపోకుండా చెల్లిస్తామంటూ ఆఫర్ ఇస్తున్నారు. మందు, విందులు, డబ్బులతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు.