సిద్దిపేట టౌన్, జనవరి 23 : పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం పర్మినెంట్ చేసి స్వచ్ఛభారత్‌కు ప్రతిరూపమైన కార్మికులను బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గాంధీ కలలు కన్న స్వచ్ఛభారత్‌కు అసలు రూపం పారిశుధ్య కార్మికులేనని గుర్తుచేశారు.ప్రధాని నరేంద్రమోదీ పారిశుధ్య కార్మికులను సన్మానిస్తాడు కానీ వారికి ఉద్యోగ భద్రత కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
దళిత పారిశుధ్య కార్మికలకు ఉద్యోగ భద్రత కల్పించకుండా వారి ఆరోగ్యాలను గాలికి వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్త చేశారు. కార్మికులు సమస్యల సాధన కోసం ఫిబ్రవరి 29న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ‘పోరుగర్జన’ తలపెట్టామన్నారు. గర్జనకు మాదిగ, మాదిగ ఉపకులాల నాయకులు, పారిశుధ్య కార్మికులు పెద్ద ఎత్తున్న హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నేతలు రాజేందర్, కుమార్, వెంకటేశ్, కృష్ణ, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.