కోహీర్, మే 10: సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండలంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగు నెలలు గడుస్తున్నా, వారికి జనవరి నుంచి వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. 21 వేల జనాభా కలిగిన కోహీర్ గ్రామం ఈ ఏడాది జనవరి 27న మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. అయితే, పట్టణంలోని మురుగు కాలువలను శుభ్రం చేసే 24 మంది కార్మికులకు మాత్రం వేతనాలు అందడం లేదు. నాలుగు నెలలుగా జీతం లేకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
మున్సిపాలిటీ ప్రారంభంలో జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్రావు ఇక్కడ అదనపు బాధ్యతలు చేపట్టారు. అనంతరం వెంకట్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించగా, ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. రెండు నెలల క్రితం రమేశ్‌ను మున్సిపల్ కమిషనర్‌గా నియమించినప్పటికీ, కార్మికుల వేతన సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.
వేతనాలు అందకపోవడంతో పారిశుద్ధ్య పనులు కూడా కుంటుబడ్డాయి. పట్టణంలోని మురుగు కాలువలు నిండిపోయి, మురుగు నీరు సీసీ రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై కమిషనర్ రమేశ్‌ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. నాలుగు నెలలుగా వేతనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పారిశుద్ధ్య కార్మికుడు శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. “కోహీర్ మున్సిపాలిటీలో 24 మందిమి మురుగు కాలువలు శుభ్రం చేయడం, తాగునీరు సరఫరా చేయడం, చెత్త తరలించడం వంటి పనులు చేస్తున్నాం. కానీ నాలుగు నెలలుగా జీతం లేదు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి” అని ఆయన కోరారు.
మున్సిపాలిటీ అధికారులు కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే వారికి బకాయిలు చెల్లించి, సమస్య పరిష్కరించాలని కార్మికులు వేడుకుంటున్నారు.