kollur 2 bhk | రామచంద్రాపురం, జూన్ 19 : కొల్లూర్ 2 బీహెచ్‌కే సముదాయంలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులపై జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తెల్లాపూర్ మున్సిపాల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో కమిషనర్ సంగారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్, రెవెన్యూ, విద్యాశాఖ, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రాథమిక, ఉన్నత పాఠశాలల తరగతి గదులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నమోదు, టాయిలెట్స్ తదితర వసతులపై డీఈవో వెంకటేశ్వర్లుతో చర్చించి మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటుకు స్థల సేకరణ చేసి వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి పంపినట్లయితే మున్సిపల్ అధికారులు పనులు ప్రారంభిస్తారని తహసీల్దార్ సంగ్రామ్రెడ్డికి సూచించారు.
కొత్త అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు..
డిగ్నిటీ హౌసెస్ అసోసియేషన్లు, కమిటీలు త్వరగా పూర్తి చేయాలని, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, స్టాప్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్లను రేడియల్ రోడ్లలో ఏర్పాటు చేయాలని, డ్రైనేజీ మరమ్మత్తులు ఏమైనా ఉంటే వెంటనే పూర్తి చేయించాలని కమిషనర్ సంగారెడ్డిని ఆదేశించారు. పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఐసీడీఎస్ అధికారులకు చెప్పారు. కొత్త ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లను ఏర్పాటు చేసి కొత్త రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయాలని కమిషనర్, తహసీల్దార్‌కు సూచించారు.
విద్యుత్‌శాఖకు సంబంధించిన సమస్యలతోపాటు, ఫ్లాట్ యజమానులకు గృహజ్యోతి పథకాన్ని అమలు చేయాలన్నారు. బీఎస్ఎన్ఎల్ సిగ్నలింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు. 2 బీహెచ్‌కే సముదాయంలో టైంలైన్ ప్రకారం అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, సీడీపీవో జయరాం, డీఈఈ సత్యనారాయణ, ఈఈ రమేశ్, తహసీల్దార్ సంగ్రామ్‌రెడ్డి, ఆర్ఐ శ్రీకాంత్, సర్వేయర్ రాంభద్రం, ఎంఈవో పీపీ రాథోడ్, ఏఈ మౌనిక, మెడికల్ అధికారి డాక్టర్ సాయి నిఖిలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Kollur 2 Bhk1