మునిపల్లి, ఆగస్టు 05: సంగారెడ్డి జిల్లా మునిపల్లి (Munipalli)లో జోరుగా డబుల్ రిజిస్ట్రేషన్ల (Double Registrations) దందా అనే శీర్షికన వార్త వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా జిల్లా అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు పలుపడేవారిపై తక్షణమే చర్యలు తీసుకుంటే అధికారుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మునిపల్లి మండలంలో అధికారులు ఎలాంటి తప్పు చేసినా పట్టించుకునే నాథుడే కరువైయ్యారా అన్నట్లు జిల్లా అధికారులపై మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. మునిపల్లి తహసీల్దార్, సబ్ రిజిస్టర్ కార్యాలయం డబుల్ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా మారినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వెయ్యడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగా తహసీల్దార్ డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారుల్లో కదిలిక కనిపించకపోవడం ఆశ్చరంగా ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ స్పందించాలి..
మండలంలో జోరుగా డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు గత నాలుగు రోజుల క్రితం ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’లో వార్త వచ్చినా జిల్లా కలెక్టర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రోత్సాహిస్తున్నారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వక్ఫ్ భూములు రిజిస్ట్రేషన్ చేసిన వారిపై..
వక్ఫ్ భూములను రిజిస్ట్రేషన్ చేసినా సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మండల మైనార్టీలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో మండలంలో రెవెన్యూ అధికారులు ఆడిందే ఆట.. పడిందే పాటగా వ్యాహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ భూములను రిజిస్ట్రేషన్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. లేనట్లయితే జాతీయ రహదారిపై రాస్తారోకో చెప్పేట్టెందుకు వెనుకడుగు వేయబోమన్నారు.