ఝరాసంగం, ఏప్రిల్16 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గేల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సిద్దుల గుట్ట సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను గురువారం ఝరాసంగం మండలం బర్దిపూర్లోని దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. హుగ్గేల్లి గ్రామానికి ఆధ్యాత్మిక శోభను చేకూర్చేలా స్వామివారి ప్రతిష్ఠాపన కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని తెలిపారు. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, భక్తుల కోసం అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో రాజయోగ ఆశ్రమ పీఠాధిపతి రాచయ్య స్వామి, హుగ్గేల్లి గ్రామ సర్పంచ్ పట్లోల విమల శ్రీనివాస్ రెడ్డి, ఎస్బీ రాములు, ఉత్సవ కమిటీ సభ్యులు ఎంజీ మానయ్య, పుట్టి అశోక్, హైదరాబాద్ కిష్టారెడ్డి, అలాగే వైదిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.