జహీరాబాద్, ఏప్రిల్ 6: శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ (Zaheerabad) పట్టణంలో 149 వ నగర సంకీర్తన వైభవోపేతంగా జరిగింది. స్థానిక హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలోని భక్త బృందం నాగులకట్ట రోడ్డు లోని హనుమాన్ మందిరం నుంచి శ్రీరాం మందిర్ వరకు సీతారామ కీర్తనలు, రాధా గోపాలుని భజనలు చేస్తూ శోభయాత్ర నిర్వహించారు. శ్రీరాం మందిరంలో మృదంగ వాయిద్యాలతో ఆలపించిన కీర్తనలు అహుతులను ఆకట్టుకున్నాయి. కీర్తనలకు అనుగుణంగా భక్తులు ముగ్ధ మనోహరులై నృత్యాలు చేస్తూ ఆనంద డోలికల్లో తేలియాడారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సత్సంగ సభలో సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధి విభిషణ్ ప్రభుజీ శ్రీ రామ నవమి విశిష్టతను వివరించారు.
సీతారాముల అన్యోన్యమైన దాంపత్యం, లక్ష్మణుని నిస్వార్థమైన సహకారం, భరతుని నిష్కళంకమైన ప్రేమ, హనుమంతుని అచంచలమైన భక్తి, దశరథరాముల మధ్య కనిపించే వాత్సల్యం, ప్రేమ ఆదర్శ ప్రాయంగా నిలుస్తాయన్నారు. సేవకురాలైన మంథర మాటలు విన్న కైకేయి లాంటి మహా పతివ్రత చరిత్ర హీనురాలిగా నిలించందని ఇదే క్రమంలో మహా సాధ్వి మండొదరి మాటలను లెక్క చేయని రావణుడు మట్టిలో కలిసి పోయాడని చెప్పారు. రామాయణం జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుందని,ప్రతి మానవునికి కష్టాలు ఉంటాయని, అయితే వాటినుండి గట్టేక్కడానికి సీత జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. శ్రీరామ నామాన్ని జపించినా, హరేకృష్ణ మంత్రం జపించినా భగవంతుడి సాక్షాత్కారం పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో కంది ఇస్కాన్ టెంపుల్ హరేకృష్ణ మూమెంట్ సభ్యులు సాక్షి గోపాల్ ప్రభుజీ, చక్రధర్ ప్రభుజీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జహీరాబాద్ మండలం లోని హుగ్గెల్లి గ్రామంలోనూ నగర సంకీర్తన భక్తుల ఆనందోత్సాహల మధ్య అట్టహాసంగా జరిగింది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి బయలుదేరిన శోభయాత్ర గ్రామ ప్రధాన వీధుల గుండా సాగింది. ప్రధాన కూడళ్ళలో చిన్నారులు నృత్యాలు చేస్తూ కీర్తనలు పాడారు.