సిటీబ్యూరో, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ) : నగరంలో మెట్రో వ్యవస్థ కాంగ్రెస్ చేతిలో నలిగిపోతున్నది. ఎల్ అండ్ టీ నుంచి తెగదెంపులు చేసుకునేందుకు మెట్రో సంస్థ ఆర్థిక వనరుల కోసం వెదుకులాడుతోంది. మార్చి నెలాఖరులోగా స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదన ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. కనీసం ఎల్ అండ్ టీ సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని సర్దుబాటు చేసే సంస్థల కోసం వెతికిపట్లే పనిలో ఉన్నారు. 72 కిలోమీటర్ల పొడవైన మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవాలంటే ఈక్విటీ మొత్తం రూ. 2వేల కోట్లు, ఆ సంస్థకు ఉన్న రూ.13వేల కోట్లు చెల్లించాలి. దీనికి వంద రోజుల గడువుతో విధించిన ఓ ఏజెన్సీ అప్పగించినా.. ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని విధించినా ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితులే ఎదురవుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఏ ఒక్క సంస్థ కూడా ఆర్థిక వనరులను అందించేందుకు ముందుకు రాలేదు. కానీ సర్కారు మాత్రం ఆర్థిక సంస్థ వెంట పడుతోంది.
ఆర్థిక వనరులను సమకూర్చుకోవడమే మెట్రో స్వాధీనానికి క్లిష్టంగా మార్చింది. గతంలో ఏడీబీలాంటి ఆర్థిక సంస్థలతో కూడా చర్చలు జరిపింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) గడపనూ మెట్రో సంస్థ తొక్కింది. మెట్రో మొదటి దశను నిర్మిస్తున్న ఎల్ అండ్ టీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, మెట్రో స్వాధీనంతో సర్కారు మోయాల్సిన ఆర్థిక భారంతో ఆ సంస్థ కూడా ముఖం చాటేసే పరిస్థితి ఉన్నట్లుగా సమాచారం. కానీ వాటి నుంచి ఊహించిన స్పందన రాలేదని సమాచారం. దీంతో మెట్రో స్వాధీనం, రెండో దశ నిర్మాణంలో అంచనాలకు మించిన ఆర్థిక భారం కూడా నగరంలో మెట్రో విస్తరణ అంశాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
అయితే భారీ అంచనాలతో రేవంత్ రెడ్డి తెరమీదకు తీసుకువచ్చిన మెట్రో విస్తరణ అంశం కూడా రాష్ట్ర సర్కారుకు ఆర్థిక భారంగానే దాపురిస్తోంది. పీపీపీ విధానంలో కేంద్ర, రాష్ట్ర సర్కారుల వాటా పోను మిగిలిన 48శాతం నిధులు ఆర్థిక సంస్థలు ఇస్తే గానీ ముందుకు కదలదు. వీటిని అధిగమించాలంటే రాష్ట్ర సర్కారు ముందుగా రూ. 7,313 కోట్లను సర్దుబాటు చేసుకుని, మిగిలిన 18శాతం మేర నిధులను కేంద్రం నుంచి పొందాల్సి ఉంటుంది. వీటన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలంటే… సర్కారు చేతిలో కనీసం రూ. 15వేల కోట్ల సర్దుబాటు చేసుకుంటే గానీ, ప్రాజెక్టు విస్తరణ, స్వాధీనం కాదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.