హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లెండి ఎట్టకేలకు కొలికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది (2027) మే నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మంగళవారం జలసౌధలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల మధ్య నిర్వహించిన 12వ ఇంటర్ స్టేట్ బోర్డు (ఐఎస్బీ) కో-ఆర్డినేషన్ మీటింగ్‌లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ప్రాజెక్టు జాప్యంపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. 2006లో రూ.128 కోట్లుగా ఉన్న తెలంగాణ వాటా అంచనా వ్యయం, జాప్యం కారణంగా ఇప్పుడు రూ.841 కోట్లకు చేరిందని తెలంగాణ ఈఎన్సీ రమేశ్‌బాబు గుర్తుచేశారు.
ప్రాజెక్టును మరింత ఆలస్యం చేస్తే వ్యయభారం మరింత పెరగడమే కాకుండా, భూసేకరణ కూడా కష్టతరమవుతుందని స్పష్టంచేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలంటే పెండింగ్‌లో ఉన్న రూ.196 కోట్లను తెలంగాణ ప్రభుత్వం వెంటనే డిపాజిట్ చేయాలని మహారాష్ట్ర అధికారులు కోరారు. 12 ముంపు గ్రామాల్లో ఇప్పటికే ఏడు గ్రామాలను తరలించామని, మిగిలిన ఐదు గ్రామాల తరలింపునకు ఈ నిధులు అవసరమని తెలిపారు. దీనిపై స్పందించిన తెలంగాణ అధికారులు.. నిధుల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించేందుకు తమ బృందం పర్యటిస్తుందని వెల్లడించారు.