ఝరాసంగం,నవంబర్15 : సంగారెడ్డి జిల్లాలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పాటిల్ ప్రత్యేక పూజలు చేశారు.
సోమవారం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి మొదటి సారి రావడంతో ఆయనకు ఆలయ ఈవో శ్రీనివాస్మూర్తి, సిబ్బంది, స్థానిక టీఆర్ఏస్ నాయకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమృతగుండం నీటితో పాదప్రక్షాళన చేసిన అనంతరం గర్భగుడిలోని పార్వతి సమేత సంగమేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు ఆయనకు కుంకుమార్చన,పాలాభిషేకం,బిల్వార్చన తదిరత పూజులు చేయించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీల కులగణన ఏర్పాటు చేసి బీసీలను విద్యా, వైద్య, ఆర్థిక పరంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
బీసీలు రాజాకీయంగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు పెంచాలన్నారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ బీసీలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.