ఝరాసంగం, జనవరి 3 : మండల కేంద్రంలోని కస్తూర్బా రెసిడెన్షియల్ హాస్టల్, లీగల్ కేర్ సపోర్ట్ సెంటర్ను జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ కవిత దేవి(Kavitha Devi) పరిశీలించారు. హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించిన కవిత దేవీ మెనూ ప్రకారం భోజనం సక్రమంగా అందడంలేదని గుర్తించారు. పప్పు సరిగా ఉడకకపోవడాన్ని గమనించి హాస్టల్ యాజమాన్యంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడవద్దని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ కవిత దేవి స్పష్టం చేశారు. మెనూ అమలు చేయకపోవడంపై సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అనంతరం లీగల్ కేర్ సపోర్ట్ సెంటర్ను తనిఖీ చేసిన జడ్జి కవిత దేవి.. అక్కడికి లబ్ధిదారులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పారా లీగల్ వాలంటీర్ అందిస్తున్న సూచనలను ఆమె పరిశీలించారు. ప్రజలకు సకాలంలో న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కవిత దేవి తెలిపారు.