sant sevalal maharaj | చౌటకూర్, ఫిబ్రవరి 18: మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ జి.నరసింహ అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జాట్రోత్ హరికిషన్ నాయక్ హాజరయ్యారు. ముందుగా కళాశాలలో సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, భోగ్ భండార్ నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 17వ శతాబ్ధంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన సేవాలాల్ దేశమంతటా తిరిగి బంజారా సమాజాన్ని ఏకం చేసిన మహానీయుడని కొనియాడారు. బాల బ్రహ్మచారిగా నిష్టతో అహింసావాదం వైపు లంబాడాలను నడింపించిన అగ్రగణ్యులని గుర్తు చేశారు. బంజారాలు ఐక్యమత్యంతో మెలగాలంటూ వారికి దిశానిర్దేశనం చేసిన దర్శానికుడని అన్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులు లంబాడ వేషధారణతో ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ నృత్యప్రదర్శన చేస్తూ అలరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘవేందర్రావు, వివిధ విభాగాధిపతులు ఆచార్య రజనేశ్, విజయ్‌కుమార్, సునీత, జోషీశ్రీపాద, భోధన, భోధనేతర సిబ్బంది, గౌరాసిక్ వాడి రాష్ట్ర అధ్యక్షుడు జగన్నాయక్, సభ్యులు రాజునాయక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.