జహీరాబాద్, జూన్ 6 : జహీరాబాద్ పట్టణంలో నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు దోహదపడుతాయని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్ అన్నారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో పిరమిల్ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన 93 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ పరితోజ్ పంకజ్ మాట్లాడుతూ.. అధునిక సాంకేతికతను కలిగిన సీసీ కెమెరాలను పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్, పట్టణంలోని ఎంట్రీ, ఎగ్జిట్లలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని జిల్లా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి నిషేధిత గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా నియంత్రించేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యత చాలా కీలకంగా మారుతుందని చెప్పారు. అనుమనాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని అన్నారు. పట్టణంలోని సీసీ కెమెరాలను ఏర్పాటుకు సహకరించిన పిరమిల్ కంపెనీ అధికారులకు అభినందించారు. ఈ సీసీ కెమెరా ఏర్పాటులో పట్టణ, మండల, గ్రామాల్లో ప్రజలు, వ్యాపారులు, యువత సహకరించాలని తెలిపారు.
ఆనంతరం గత నెల 26వ తేదిన న్యాల్కల్ మండలంలోని రుక్మాపూర్‌లో హత్యకు గురైన బోరెంచ రాణేమ్మ ఛేదించి నేరస్తున్ని పట్టుకున్న జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు, హద్నూర్ ఎస్ఐ చల్లా రాజశేఖర్, క్రైం బ్రాంచ్ పోలీసులు ఓందేవ్, అస్లాం, అనంద్, హరితేజ, పోలీసులు రాజశేఖర్, సుభాష్, రవికుమార్, సాయికుమార్, భరత్గౌడ్లను జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్ అభినందించి, రూ. 10 వేల రివార్డును అందజేశారు. అనంతరం చిరాగ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాడ్గి గ్రామ శివారులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును తనిఖీ చేశారు. బక్రీద్ పండగ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి గోవులను అక్రమంగా తరిలించకుండా వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. అనంతరం చిరాగ్పల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్‌స్టేషన్‌లో క్రైం రేట్‌తో పాటు నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఎస్ఐ రాజేందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.