కోహీర్, మార్చి 5: భక్తుల కోర్కెలు తీర్చే బడంపేట రాచన్నస్వామి బ్రహ్మోత్సవాలకు వేళైంది. కొంగుబంగారమైన భద్రకాళిదేవి, వీరభద్రావతారంలోని స్వామివారి దర్శనానికి తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు దేవాదాయశాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేసి, అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో రథం ఊరేగింపు, అగ్గితొక్కడం, స్వామివారి కల్యాణోత్సవాన్ని జరిపిస్తారు. ఆలయ ఆవరణలో కోనేరు ఉన్నప్పటికీ కొవిడ్-19 నేపథ్యంలో భక్తులను అందులోకి రాకుండా నిషేధించారు. ఆలయానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం కొనసాగుతున్నది.
కర్ణాటకలోని మల్కేడ్ ఆశ్రమ పీఠాధిపతి గురుగంగాధర మహాస్వామి చేతుల మీదుగా వేడుకలు ప్రారంభంకానున్నాయి. ధ్వజారోహణం, శిఖరపూజ, జహీరాబాద్‌కు చెందిన కౌలాస్ పరివార్ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించనున్నారు.
రాత్రి ప్రముఖుల ప్రవచనాలు, బుర్రకథ, హరికథ, భజనలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ గావించనున్నారు. రెండోరోజైన మంగళవారం ఉదయం గర్భగుడిలోని స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, పల్లకీసేవ చేస్తారు. అనంతరం స్వాములు, భక్తులు అగ్నిగుండంలోకి ప్రవేశించి తమ భక్తిని ప్రదర్శిస్తారు. ప్రముఖుల ప్రవచనాలు, దేవాలయ అభివృద్ధికి భక్తుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తారు. రాత్రి భజనలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. చివరి రోజు బుధవారం జహీరాబాద్ పట్టణానికి చెందిన కౌలాస్ కుటుంబం ద్వారా రుద్రాభిషేకం, కుంకుమార్చన, అన్నపూజలు, మహామంగళహారతి చేపట్టనున్నారు. సాయంత్రం భద్రకాళిదేవి సహిత రాచన్నస్వామి కల్యాణమహోత్సవం, రథోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలి..
ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ యేడు కూడా రాచన్నస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరమేశ్వరుడి కృపకు పాత్రులు కావాలి.
– విభూతి శివరుద్రప్ప, ఆలయ ఈవో
భక్తుల కోర్కెలు తీరుస్తడు..
350 సంవత్సరాల క్రితం బడంపేట శివారులో వీరభద్రావతారంలో రాచన్నస్వామి కొలువుదీరాడు. కర్నూలు జిల్లా రాయచోటి నుంచి తీసుకువచ్చిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి నిత్యపూజలు కొనసాగుతున్నాయి. భక్తుల కోర్కెలు తీరుస్తున్నడు.
– శివానంద్, రాచన్నస్వామి దేవాలయ కార్యదర్శి