రామచంద్రాపురం, ఫిబ్రవరి14: సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్ ఓల్డ్ ఎంఐజీకి చెందిన యువ క్రికెటర్ తిలక్‌వర్మకు ఐపీఎల్లో చోటు దక్కింది. ముంబై ఇండియన్స్ తిలక్‌వర్మను రూ.1.70 కోట్లకు వేలంలో సొంతం చేసుకున్నది. తిలక్‌వర్మ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. ఆయన తండ్రి నాగరాజు బీహెచ్ఈఎల్లో కాంట్రాక్ట్ కార్మికుడు, తల్లి గాయత్రి గృహిణి, సోదరుడు తరుణ్ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. తిలక్‌వర్మ తండ్రి నాగరాజు ఓల్డ్ సిటీ నుంచి భెల్‌కు వచ్చి ఇక్కడే పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తిలక్‌వర్మకు క్రికెట్‌పై ఎక్కువగా ఆసక్తి ఉండడంతో కుటుంబ సభ్యులు 9 ఏండ్ల వయస్సులో అతడిని శేరిలింగంపల్లి పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో క్రికెట్ కోచింగ్‌కు పంపించారు. అక్కడ కోచ్ సలాం శిక్షణలో తిలక్ క్రికెట్లో మంచి ప్రావీణ్యం సంపాధించాడు. కుడి చేతివాటం బౌలింగ్, ఎడమ చేతితో బ్యాటింగ్ తిలక్ స్పెషల్. 2018-19లో రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున ఫస్ట్‌క్లాస్ ఆరంగేట్రం చేశాడు. టీ 20లో 15 మ్యాచ్‌లు ఆడి 381 పరుగులు చేసి లిస్ట్ ‘ఎ’ క్రికెట్లోనూ నిలకడగా రాణించాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో 180 పరుగులు సాధించగా, సయ్యద్ ముస్తాక్‌అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు తిలక్. లిస్ట్ ‘ఎ’లో 16 మ్యాచ్‌లు ఆడి 784 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 156 పరుగులు. బ్యాటింగ్ యావరేజ్ 52.26గా ఉంది. టీమిండియా అండర్ 19లో బ్యాటింగ్ బ్యాక్‌బోన్‌గా తిలక్ గుర్తింపు పొందాడు. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 144 ఉంది. హైదరాబాద్ బిడ్డ తిలక్‌వర్మను ఐపీఎల్లో ఆడేందుకు ముంబై ఇండియన్స్ రూ.1.70 కోట్లకు సొంతం చేసుకోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రీడా, రాజకీయ ప్రముఖులు, స్థానికులు తిలక్‌కు అభినందనలు తెలుపుతున్నారు.