సంగారెడ్డి, జూలై 11: వర్షాకాలంలో వరద నీటి ప్రవాహం సాఫీగా వెళ్లేందుకు చెరువు కింద కట్టు కాలువల్లో పూడిక తీయాలని నీటి పారుదలశాఖ అధికారులను కలెక్టర్ శరత్ నాయక్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలో అలుగు పారుతున్న మహబూబ్‌సాగర్ చెరువును ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డిలతో కలిసి కలెక్టర్ సందర్శించి వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గడ్డి, గుర్రపు డెక్కను తొలిగించాలని సూచించారు. అనంతరం కంది మండలంలోని ఐఐటీ వద్ద జాతీయ రహదారి సమీపంలో ఉన్న హోటల్ యాజమాన్యం కిసాన్ చెరువు కట్టు కాలువను ఆక్రమించి పార్కింగ్‌కు వినియోగించుకోవడంపై కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పార్కింగ్‌ను తొలిగించి కాలువ పూడిక తీయాలని, కాలువను తిరిగి ప్రారంభించాలని నీటి పారుదల ఎస్ఈని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయని, దీంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలుగు పారే చెరువులను చూసేందుకు ప్రజలను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించవద్దని స్పష్టం చేశారు. ప్రమాదాలు జరుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. చెరువుల కట్టు కాలువలను ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శరత్ నాయక్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట నీటి పారుదలశాఖ ఎస్ఈ మురళీధర్, ఈఈ మధుసూదన్‌రెడ్డి, డీఈ బాలగణేశ్, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్, కంది, సంగారెడ్డి తహసీల్దార్లు స్వామి, విజయలక్ష్మి ఉన్నారు.