సంగారెడ్డి అర్బన్, జూన్ 14: నేరాల అదుపులో భాగంగా మూడు రాష్ర్టాలకు చెందిన బార్డర్ జిల్లాల పోలీస్ అధికారుల సమీక్షలో మంగళవారం నేరసమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల బార్డర్ జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్, డీఎస్పీలు, సీఐలు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. సరిహద్దు జిల్లా పోలీసులు సత్సంబంధాలు కలిగి ఉండి నేరాల అదుపునకు కృషి చేయడం, పరస్పర సమాచారం అందిపుచ్చుకోవడంపై చర్చించారు. మిస్సింగ్ కేసులు, గుర్తు తెలియని మృతదేహాలు సమాచారం లుక్ ఔట్ నోటీసులను బార్డర్ పోలీస్ స్టేషన్లకు ఇవ్వడం ద్వారా కేసుల ఛేదన సులభతరం అవుతుందన్నారు. అంతర్ రాష్ట్ర దొంగల ముఠాల సమాచారం పరస్పర బదిలీ చేయడం ద్వారా కేసులను త్వరితగతిన ఛేదించగలమన్నారు.
వీఐపీలకు ఎస్కార్ట్, ఫైలేటింగ్ విషయమై సమాచారం బార్డర్ పోలీస్స్టేషన్లకు అందించి పరస్పరం సహకారం చేసుకోవాలన్నారు. మన రాష్ట్రంలో నిషేధించబడిన గుట్కా, గంజాయి ఇతర పొరుగు రాష్ర్టాల నుంచి రవాణా అవుతున్న సమాచారం బార్డర్ పోలీసులకు ఇస్తే కేసులు అరికట్ట్టవచ్చన్నారు. నేరాలకు పాల్పడి ఇతర రాష్ర్టాల్లో తలదాచుకున్న నేరస్తుల విషయమై పరస్పర సహకారం అవసరమన్నారు. ఈ సమావేశంలో బీదర్ జిల్లా ఎస్పీ కిశోర్‌బాబు, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, లాతుర్, నాందేడ్, కలగుర్గి, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.