తూప్రాన్/ మనోహరాబాద్, జూన్6: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘పల్లె ప్రగతి’ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ శరత్‌కుమార్ అధికారులకు సూచించారు. తూప్రాన్ మండలం ఇమాంపూర్‌లో మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీపీవో తరుణ్‌కుమార్‌తో ఆకస్మికంగా పర్యటించారు. పల్లె ప్రగతిలో జరుగుతున్న కార్యక్రమాలు, గ్రామాల్లోని అభివృద్ధిని పరిశీలించారు. నర్సరీని పరిశీలించి, ప్రతి ఇంటికీ ఐదు మొక్కలు తప్పనిసరిగా పెంచేవిధంగా చూడాలని, ఇంటి యజమానులకు మొక్కలు అందజేయాలన్నారు. కాగా, మురుగు కాల్వల నిర్వహణపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిర్వహణ సరిగ్గా లేదని తీసిన చెత్తను వెంటనే డంపింగ్‌యార్డుకు తరలించాలని సూచించారు. ఒక్క పల్లె ప్రగతిలోనే కాకుండా నిరంతరం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూడాలన్నారు.
వైకుంఠధామాన్ని ప్రారంభించి, ప్రజలకు వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. అవసరమైతే నిధులు సమకూర్చుకొని వైకుంఠరథాన్ని అందుబాటులోకి తేవాలన్నారు. ప్రభుత్వం లక్షలు వెచ్చించి నిర్మిస్తే వినియోగించకపోవడం బాధాకరమన్నారు. డంపింగ్‌యార్డు తడి, పొడి చెత్త నిర్వహణ, హరితహారంపై కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. డంపింగ్‌యార్డులో జమ చేసిన ప్లాస్టిక్, ఇనుము, సీసం తదితర వస్తువులను విక్రయించాలన్నారు. వచ్చిన డబ్బులతో పారిశుధ్య కార్మికులకు జీతాలు, నూనె, సబ్బు తదితర ఖర్చులు పంచాయతీపై భారం పడకుండా ఆపవచ్చన్నారు. ఇదే తరహాలో ముందుకుసాగాలని, ప్రజల్లో స్వచ్ఛతపై చైతన్యం తీసుకురావడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రమించాలన్నారు. అంతకుముందు గ్రామానికి చెందిన స్వామిగౌడ్ పెంచుతున్న ఈత వనాన్ని పరిశీలించారు. ఈతవనాల పెంపకంపై ఆరా తీశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకటశైలేశ్, ఆర్డీవో శ్యాంప్రకాశ్, ఎంపీడీవో అరుంధతి, సర్పంచ్ ఎల్లం, నాయకులు స్వామిగౌడ్, చంద్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలను శుభ్రంగా తయారు చేయాలి
అభివృద్ధికి మారుపేరుగా పల్లెలను తీర్చిదిద్ది శుభ్రంగా తయారు చేయాలని, అప్పుడే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం మండల పరిధిలోని మండలం హనుమాన్ నగర్ పంచాయతీని సందర్శించి గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ మోహన్ సింగ్ నాయక్‌తో కలిసి గ్రామంలో తిరుగుతూ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను సంరక్షించే బాధ్యత గ్రామస్తులపై ఉందని, పంచాయతీ అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డు, గ్రామానికి ఆటస్థలాన్ని పరిశీలించారు. గ్రామానికి వచ్చిన కలెక్టర్‌ను సర్పంచ్ శాలువాతో సత్కరించి, స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిస్తుందని, గ్రామాల అభివృద్ధిలో గ్రామస్తుల పాత్ర గొప్పదని కితాబిచ్చారు. కలెక్టర్‌వెంట ఎంపీడీవో ఆకుల రవీందర్, తహసీల్దార్ స్వామి, పంచాయతీ అధికారులు, వార్డు సభ్యులు తదితరులున్నారు.