గుమ్మడిదల, జూన్ 1: రియల్టర్ల ఆగడాలు అధికమయ్యా యి. కాసుల కక్కుర్తికి ఆశపడి ప్రభుత్వ భూమి లే అవుట్ వేశారు. 60 గజాల ఓపెన్ ప్లాటు రూ.6.50 లక్షలకు విక్రయిస్తున్నట్లు బ్రోచర్ కూడా తయారుచేశారు. దీన్ని చూసి పంచాయతీ పాలకులు, గ్రామస్తులు విస్తుపోతున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని అన్నారంలో రియల్టర్లు బరితెగిస్తున్నారు. 2007లో అప్పటి ప్రభుత్వం 60 గజాల చొప్పున ప్లాట్లు చేసి పేదలకు అందజేసి, ఇందిరమ్మ కాలనీగా నామకరణం చేసింది. కొందరు ఇండ్లు కట్టుకున్నారు. మరి కొందరు తమ ప్లాట్లకు హద్దురాళ్లు వేసుకున్నారు. అప్పటి ప్రజాప్రతినిధుల వద్ద మిగిలిన ప్లాట్ల సర్టిఫికెట్లతో ఇప్పుడు రియల్టర్లు దర్జాగా దందా చేస్తున్నారు.
అన్నారం గ్రామ శివారులోని 261 సర్వే నంబర్లో రెం డొందల ఎకరాలకు పైచిలుకు ప్రభుత్వ భూమి ఉంది. 2007లో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిట సునీతా లక్ష్మారెడ్డి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని సూచించారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిలో 60 గజాల చొప్పున 613 ప్లాట్లు సిద్ధం చేసి లేఅవుట్ చేశారు. 300 మంది పేదలకు ఈ ప్లాట్ల సర్టిఫికెట్లు పంపిణీచేశారు. మిగిలిన 313 ప్లాట్ల సర్టిఫికెట్లు రెవెన్యూ అధికారుల పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో అ ప్పటి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి మిగిలిన 313 ప్లాట్లను ఇష్టం వచ్చిన వారికి విక్రయించి సర్టిఫికెట్లు అందజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇందిరమ్మ కా లనీకి సంబంధించిన లేఅవుట్, మిగిలి ఉన్న ప్లాట్ల వివరాలు అందజేయాలని రెవెన్యూ అధికారులను విన్నవించినా ఫలితం లేదని సర్పంచ్ తిరుమలవాసు తెలిపారు. కొంత మంది రియల్టర్లు ఈ ప్లాట్లు విక్రయించడానికి ఏకం గా బ్రోచర్ తయారు చేసి, దీనికి గ్రీన్ లేక్ ప్రాపర్టీ డెవలపర్స్ పేరిట 10 ఎకరాల్లో లేఅవుట్ చేశారు. 60 గజాల ఓపె న్ ప్లాటును రూ.6.50 లక్షలకు విక్రయిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పంచాయతీ పాలకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
పరిశీలించి, చర్యలు తీసుకుంటాం
అన్నారంలోని ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇచ్చిన ప్లాట్లు. ఇందులో ఎవరు రియల్ దందా చేసినా వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు క్రయవిక్రయాలు చేయరాదనే నిబంధనలు ఉన్నాయి. ఈ కాలనీలో ప్లాట్లు విక్రయించడానికి బ్రోచర్ తయారు చేశారని మా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ఆ కాలనీకి మా అధికారులను పంపించి పూర్తి వివరాలు తెలుసుకుని, చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఆందోళన చెందొద్దు.
– సుజాత, తహసీల్దార్, గుమ్మడిదల
రియల్టర్లకు అడ్డుకట్ట వేయాలి
ప్రభుత్వ భూమిలోని 261 సర్వే నంబర్లో 613 ప్లాట్లతో లేఅవుట్ చేసి, 60 గజాల చొప్పున 300 మందికి అందజేశారు. మిగిలిన ప్లాట్లలో రియల్టర్లు గ్రీన్లేక్ ప్రాపర్టీ పేరిటతో లేఅవుట్ సిద్ధం చేసి, విక్రయించేందుకు బ్రోచర్ విడుదల చేశారు. వెంటనే జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి మిగిలిన ప్లాట్లను పేదలకు పంపిణీ చేయాలి.
-మ్యాకం తిరుమలవాసు,సర్పంచ్, అన్నారం గ్రామం.