సంగారెడ్డి, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో క్రీడ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 647 పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం లాంచనంగా 54 క్రీడా ప్రాంగణాలను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వం ‘తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగ ణం’ అనే పేరుతో గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయతీల్లో క్రీడా మైదానాలను ఏర్పా టు చేస్తున్నది. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఇటీవలే క్రీడా మైదానాలు ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత వేగంగా గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో కలెక్టర్ హన్మంతరావు అధికారులతో సమావేశమై క్రీడా మైదానాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
జిల్లా కేంద్రమైన సంగారెడ్డితోపాటు పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్‌లో స్టేడియాలు అందుబాటులో ఉన్నాయి. క్రీడాకారులతో పాటు యువత, విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు అవసరమైన క్రీడా సామగ్రి సైతం అందుబాటులో ఉంది. అయితే గ్రామాల్లో క్రీడా మైదానాలు అందుబాటులో లేవు. గ్రామాల్లో సరైన ఆట స్థలాలు లేకపోవటంతో యువకులు, విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాలు, ప్రతిభ వెలుగు చూడటం లేదు. గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, షటిల్ ఎక్కువగా ఆడుతుంటారు. పాఠశాలల్లో అనువైన ఆట స్థలాలు లేకపోవటంతో విద్యార్థులు సైతం క్రీడలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామాల్లోని క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గ్రామీణ క్రీడాకారులకు క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి రానుండటంతో గ్రామ స్థాయి క్రీడాకారులు మండల, జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో సత్తా చాటే అవకాశం ఉంటుందని జిల్లాకు చెందిన కోచ్‌లు అంటున్నారు. దీంతో రాష్ట్ర ప్రభు త్వం గ్రామానికి ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామ పంచాయతీలో ఎకరం నుంచి ఎకరానికిపైగా విస్తీర్ణంలో క్రీడా ప్రాంగణం ఏర్పా టు చేయటం జరుగుతుంది. ఇందుకోసం గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్ర భుత్వ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లాలో గ్రామీణ క్రీడా ప్రాం గణాల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
నేడు మెదక్ జిల్లాలో 14క్రీడా ప్రాంగణాలు ప్రారంభం
మెదక్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : పల్లెల్లో ప్రతిభ గల క్రీడాకారులకు ప్రోత్సాహం అందించి చాంపియన్లుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. కొన్ని క్రీడా ప్రాంగణాలను తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా జూన్ 2న జిల్లా లో 40క్రీడా ప్రాంగణాలు సిద్ధం కాగా, 14క్రీడా ప్రాంగణాలు ప్రారంభం కానున్నాయి. మరో 26 క్రీడా ప్రాంగణాలకు స్థలాల సమస్య ఉందని డీఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు.
ఉపాధి హామీ నిధులతో…
ప్రతి పంచాయతీలో ఎకరం నుంచి ఎకరంన్నర ప్రభుత్వ స్థలాన్ని ప్రాంగణానికి కేటాయించాలని ఉత్తర్వులు వచ్చాయి. క్రీడా ప్రాంగణాన్ని ఎంపిక చేసి చదును చేయడం, మొరం నింపడం పనులకు ఉపాధి కూలీలను కేటాయిస్తున్నారు. ఈ మైదానాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, లాంగ్‌జంప్ కోర్టులు నెలకొల్పడంతో పాటు వ్యా యామం చేసేందుకు అనుకూలంగా నిర్మించనున్నారు. ఈ మైదానాలు తమకు ఎంతో ఉపయోగపడుతాయని గ్రామీ ణ క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 647క్రీడా ప్రాంగణాలు
సంగారెడ్డి జిల్లాలోని 647 గ్రామ పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం ఇప్పటి వరకు 322 పంచాయతీల్లో స్థలాలను గుర్తించటం జరిగింది. 54పంచాయతీ ల్లో క్రీడా ప్రాంగణాలు సిద్ధం చేశారు. అమీన్పూర్ మండలంలో దాయర, జానకంపేట్, అందోలు మండలంలో డాకూరు, చింతకుంట, సం గుపేట్, గుమ్మడిదల మండలంలో గుమ్మడిదల, కానుకుంట, హత్నూర మండంలో పన్యాల, హత్నూర, ఝరాసంగం మండలంలో గంగాపూర్, పొట్పల్లి గ్రా మంలో క్రీడా ప్రాంగణాలు సిద్ధం అయ్యాయి.
జిన్నా రం మండలంలోని వావిలాల, నల్తూర్, గడ్డపోతారం, కల్హేర్ మండలంలోని రాంరెడ్డిపేట్, నాగ్థర్, కంది మండలంలోని ఇంద్రకరణ్, వడ్డెనగూడతండా, చెర్యాల్, కంగ్టి మండలంలోని కంగ్టి, కోహీర్ మండలంలోని సిద్ధాపూర్, బిలాల్పూర్, కొండాపూర్ మండలంలోని గంగారం, తొగర్పల్లి గ్రామాల్లో క్రీడా ప్రాం గాణలు సిద్ధం చేశారు. మనూరు మండలంలోని తుమ్నూరు, పుల్కుర్తి, మొగుడంపల్లి మండలంలోని మొగుడంపల్లి, గుండుపల్లి, మునిపల్లి మండలంలోని చిన్నచెల్మడ, బుసారెడ్డిపల్లి, నాగల్గిద్ద మండలంలోని శేరి దామరగిద్ద, నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లి, నిజాంపేట్, అనంతసాగర్, న్యాల్కల్ మండలంలోని హద్నూర్, హుసేన్పల్లి, పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్, రామేశ్వరంబండ, పుల్కల్ మండలంలోని పుల్కల్, శివ్వంపేట, సింగూర్, మంతూరు, రాయికోడ్ మండలంలోని సింగీతం, పీపడ్పల్లి, సదాశివపేట మండలంలోని నందికంది, మద్దికుంట, సంగారెడ్డి మండలంలోని కులబ్గూరు, హనుమాన్‌నగర్, సిర్గాపూర్ మండలంలోని కడ్పల్, అంతర్గావ్, వట్పల్లి మండలంలోని నాగులపల్లి, నిర్జప్ల, జహీరాబాద్ మండలంలోని చిరాగ్పల్లి, బుర్థిపాడ్ గ్రామ పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలు సిద్ధమయ్యాయి. 54 పంచాయతీల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను గురువారం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.