సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 1: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బడిబాటపై ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి బడిబాట కార్యక్రమంలో భాగంగా బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని తెలిపారు. ఇటుక బట్టీలు, హోటళ్లు, పరిశ్రమలు, దుకాణాల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి, పాఠశాలలకు తీసుకొచ్చేందుకు కార్మిక శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. చిన్న పిల్లలతో పని చేయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బడీడు ఉన్న పిల్లల వివరాలను ఎంఈవోలకు అందజేయాలన్నారు. ఐదేండ్లు పూర్తయిన చిన్నారుల వివరాలను శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా చూడాలన్నారు.
డోర్ టూ డోర్ సర్వే చేయాలి
ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు డోర్ టూ డోర్ సర్వే చేసి విద్యార్థులను ఎన్రోల్మెంట్ చేయాలని వీరారెడ్డి సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తున్నట్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నట్లు తెలపాలన్నారు. అన్ని వసతి గృహాల్లోని ఎంతమంది విద్యార్థులను చేర్చవచ్చో ఈ నెల 10 వరకు నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో నగేశ్, విద్య, డీఆర్డీవో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కార్మిక పరిశ్రమల శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.