సంగారెడ్డి, మే 21 (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి అర్బన్: సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేశారని మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. శనివారం సంగారెడ్డి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాదయాత్ర నిర్వహించారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 11, 12, 30, 36 వార్డుల్లో సాయంత్రం వరకు కొనసాగింది. ఇందులో భాగంగా ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై వార్డుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూనే మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులు వెంటనే చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 2018లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడకు వచ్చి, తమ్ముడు చింతా ప్రభాకర్ కోరిక మేరకు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తుకు చేశారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇచ్చారన్నారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన ప్రయత్నం వల్లే సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చిందని ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటన్నారు. తనను తాను గొప్పగా చెప్పుకునేందుకు మెడికల్ కాలేజీ విషయంలో ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే తప్పరని, సంగారెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మెడికల్ కాలేజీ మంజూరు చేశారని, మెడికల్ కాలేజీ విషయమై కాంగ్రెస్ నాయకులు చేసే దుష్ప్రచారాలను నమ్మొద్దని ప్రజలను కోరారు.
సీఎం కేసీఆర్ సంగారెడ్డికి వస్తే తాను స్వాగతం పలుకుతానని ఎమ్మెల్యే చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు జిల్లా మంత్రి హరీశ్‌రావు, ఎంపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులను సక్రమంగా వినియోగించాలన్న సంకల్పంతో పట్టణంలో పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయా వార్డుల్లోని ప్రజలను కలిసి వారి అవసరాలను గుర్తిస్తున్నామని, ప్రాధాన్యతా క్రమంలో ప్రగతి పనులు చేపడుతున్నామన్నారు. తాను చేపడుతున్న పాదయాత్రలో కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం పాల్గొని తమ వార్డుల్లో చేపట్టాల్సిన పనుల జాబితా అందజేస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో పార్టీలకు అతీతంగా అన్నివార్డుల్లో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు బొంగుల రవి, విజయేందర్‌రెడ్డి, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకరి లత, కౌన్సిలర్లు రామప్ప, లాడె మల్లేశం, లక్ష్మణ్, తులసీరాం, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నర్సింలు, కాలనీ వా సులు తదితరు లున్నారు.