సంగారెడ్డి, మే 1: తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేసి పాఠశాలలకు మహర్దశ పట్టిస్తున్నదని సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. ఆదివారం సదాశివపేట పట్టణం, మండల పరిధిలో ‘మన ఊరు-మనబడి’, ‘మన బస్తీ-మనబడి’ కార్యక్రమంలో భాగంగా మరమ్మతు పనులను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్తో కలిసి భూమిచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేసి పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నదన్నారు. సదాశివపేట పట్టణంలో 10 పాఠశాలలకు రూ.6,34,35,625, మండలంలోని నందికంది, పెద్దాపూర్లలో 4 పాఠశాలలకు రూ.1,08,02,089 కోట్లు మొత్తం రూ.7,44,37,714ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని, వాటితో పనులు ప్రారంభించాలన్నారు. అవసరమైన పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. పాఠశాలలను మెరుగు పర్చేందుకు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందచేస్తే వారి పేర్లను పాఠశాలకు పెడతామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సదాశివపేట ఎంపీపీ తొంట యాదమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, ఇంద్రమోహన్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఏఈ రాజమల్లయ్య, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.