మునిపల్లి, జులై 30: సంగారెడ్డి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం మునిపల్లి మండలం మక్తక్యాసారం నుంచి సదాశివపేటకు వెళ్తుండగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. కానీ అదృష్టవశాత్తూ బస్సులో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
రహదారిపై గుంతను తప్పించబోయే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సును కంట్రోల్ చేసే సమయంలో డ్రైవర్ చేతికి స్వల్ప గాయమైంది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో బస్సులో ప్రయాణిస్తున్న స్కూల్ విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, రహదారులు బాగోలేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోయారు. మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి తాటిపల్లి- మక్తక్యాసారం రహదారిని బాగు చేయించాలని వేడుకున్నారు.