
జిన్నారం, జూన్ 25 : ప్రజల అవసరాలను గుర్తించి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేపడితే చిరస్థాయిగా నిలిచిపోతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఊట్ల పంచాయతీ దాదిగూడ గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే రూ.25లక్షల సొంత ఖర్చుతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త భాస్కర్‌ను పరామర్శించారు. ఇటీవల అతను రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ ఆంజనేయులు, వైస్ ఎంపీపీ గంగు రమేశ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకటేశంగౌడ్, మాజీ సర్పంచ్ శివరాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, ఉపసర్పంచ్ రవీందర్ పాల్గొన్నారు.
కుడికుంట అభివృద్ధికి రూ.32.50 లక్షలు
బొల్లారం, జూన్ 25 : చెరువులు, కుంటల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నా రు. ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో బొల్లా రం మున్సిపాలిటీలోని కుడి కుంట చెరువులో గుర్ర పుడెక్క తొలగింపు పనులకు మంజూరైన రూ.32.50 లక్షల నిధుల కాపీని టీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ కోలన్ బాల్రెడ్డికి ఎమ్మెల్యే అందజేశారు. ఇరిగేషన్ శాఖ క్లియరెన్స్‌తో నిధులను మంజూరు చేయించడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యేకి ఈ సందర్భంగా నాయకులు బాల్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గుండ్ల మహేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఖాజీపల్లి సమస్యలను పరిష్కరిస్తాం
ఖాజీపల్లి గ్రామంలో తరుచు తలెత్తుతున్న విద్యుత్, మిషన్ భగీరథ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. పంచాయతీ కార్యాలయంలో విద్యుత్, మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా పైపులైన్ నిర్మాణం పూర్తి చేసి వారం రోజుల్లో ఇంటింటికీ మంచినీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇరవై రోజుల్లో నిరంతర విద్యుత్ అందించాలన్నారు. మాదారం గ్రామంలో సబ్‌స్టేషన్ ఏర్పాటైనప్పటికీ స్థల సమస్య కారణంగా ఖాజీపల్లి గ్రామానికి తరలిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ చిట్ల సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
పటాన్చెరు మండలం భానూర్ గ్రామ పరిధిలోని కంచర్ల గూడెంలో జీర్ణోద్ధరణ గావించిన భ్రమరాంభిక మల్లికార్జునస్వామి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దశరథరెడ్డి తెలిపారు. అనంతరం బండ్లగూడకు చెందిన భాస్కర్‌కు రూ. 60 వేల సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్‌రెడ్డి, యాదగిరియాదవ్, నగేశ్‌యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు పాండు పాల్గొన్నారు.