నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామంలో బుధవారం రాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకకాలంలోనే గ్రామంలోని ఐదు ఇండ్ల తాళాలను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపూర్ గ్రామంలోని ఎడ్ల పోచయ్య, నీరుడి బాలమణి, నీరుడి చిన్న బాలమని, రోటం ప్రభు, పిచ్చకుంట్ల నరసింహులు వారి వారి ఇండ్లకు తాళాలు వేసి బంధువుల ఇంటి వద్దకు వెళ్లారు. ఇదే అదునుగా చూసిన దొంగలు వారి ఇండ్లపై విరుచుకుపడి బంగారం, వెండి, నగదు, బియ్యం తదితర సామగ్రిని దోచుకెళ్లారు.
ఎడ్ల పోచయ్యకు చెందిన గల్లపెట్టలోని డబ్బులు, 15 తులాల పట్ట గొలుసులు, నీరుడి బాలమణికి చెందిన ఐదు తులాల బంగారం, 60 వేల నగదు, రోటం ప్రభుకి చెందిన బియ్యం, గ్యాస్ సిలిండర్ను దొంగలు అపహరించారు. చిన్న బాలమణి, పిచ్చకుంట్ల నర్సింలు ఇంటి తాళం పగలగొట్టినప్పటికీ అందులో నుండి ఎలాంటి సామగ్రి పోలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అతి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్సై లింగం వెల్లడించారు.