గుమ్మడిదల,మే14: ప్యారానగర్ డంపింగ్‌యార్డును రద్దు చేయాలని ప్యారానగర్, నల్లవెల్లి గ్రామాల రైతులు, మహిళలు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 99వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం మండలంలోని నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో రైతు జేఏసీ నాయకులు, మహిళా సంఘాలు సభ్యులు సంయుక్తంగా చేస్తున్న రిలే నిరాహారదీక్షలు ప్రతి రోజు కొనసాగుతున్నాయి.
పండుగలు, శుభకార్యాలు వదులకుని తమ పిల్లల భవిష్యత్ కోసం డంపింగ్‌యార్డును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా రాష్ట్ర సర్కారు, జిల్లా యంత్రాంగం స్పందించకపోవడం అన్యాయమని రైతుల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర పాలకవర్గం స్పందించి డంపింగ్‌యార్డుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రైతులు, మహిళలు పాల్గొన్నారు.