జహీరాబాద్, ఏప్రిల్ 8: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని రంజోల్ గ్రామంలోని కబ్జాకు గురైన రామ మందిర భూమిని కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం రంజోల్ గ్రామానికి చెందిన రామ మందిరంలో ఎవరు పూజ చేస్తారో వారే ఆలయ భూముల్లో పంటలు పండించుకుని వచ్చిన డబ్బులతో జీవనం సాగించాలని అప్పట్లో పెద్దలు ఒప్పందం చేశారు. అయితే ఆలయంలో పూజలు చేసే వ్యక్తులు మాత్రం భూమిని తమ పేరిట మార్చుకున్నారు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయానికి చెందిన భూమి ఆలయానికే ఉండాలని.. పూజలు చేసే వ్యక్తులు భూమిని ఎలా తమ పేరు మీదకు మార్చుకుంటారని గ్రామస్థులు నిలదీశారు. కబ్జాకు గురైన ఆలయ భూమిని కాపాడాలంటూ ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్ పట్టణ, రూరల్ ఎస్ఐలు కాశీనాథ్, ప్రభాకర్‌రావు అక్కడి చేరుకుని ఆందోళ కారులతో మాట్లాడారు. రామమందిరానికి సంబంధించిన భూముల సమస్య పరిష్యారమయ్యే వరకు ఎవరు కూడా ఆ భూమిలో పనులు చేపట్టవద్దని పోలీసులు సూచించారు. పోలీసుల జోక్యంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.