సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 10 : ఈనెల 23 నుంచి 25 వరకు జిల్లాలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ, అనుబంధ శాఖలతో జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజర్షి షా మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జనవరి 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులోభాగంగా 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామన్నారు. ఈనెల 23న పోలియో చుక్కలు వేసుకోకుండా మిగిలిపోయిన పిల్లలకు 24, 25వ తేదీల్లో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేస్తారని తెలిపారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 1,86,190 మంది ఉంటారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 1,119 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో 922 గ్రామీణ ప్రాంతాలు, 197 పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. 36 బస్టాండ్లు, ఒక రైల్వేస్టేషన్లో పీపీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో 4,476 మంది వ్యాక్సినేటర్లు, 1,583 మంది వైద్య సిబ్బంది, 1,344 మంది అంగన్వాడీ వర్కర్లు, 953 మంది ఆశ వర్కర్లు, ఇతర వలంటీర్లు పది మంది, ప్రోగ్రాం అధికారులు పది మంది పాల్గొంటారని తెలిపారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 08455-274824 నంబర్‌ను అందుబాటులో ఉంచామని చెప్పారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీ స్థాయిలో కమ్యూనికేషన్ కంట్రోల్‌రూమ్ ఉంటుందన్నారు. అన్ని ప్రభుత్వ, గుర్తింపు పొందిన దవాఖానల్లో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. సమావేశంలో జిల్లా టీకా అధికారి డాక్టర్ శశాంక్, ఐఎంఏ చైర్మన్ డాక్టర్ చక్రపాణి, డీపీవో సురేశ్ మోహన్, సంక్షేమాధికారి పద్మావతి, డీఆర్డీవో అదనపు పీడీ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.