జహీరాబాద్ , నవంబర్ 15 : శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్సర్చ్ నిర్వహించామని జహీరాబాద్ (Zaheerabad) డీఎస్పీ సైదా నాయక్ అన్నారు. శనివారం ఉదయం జహీరాబాద్ పట్టణంలోని భారత్ నగర్ కాలనీలో డీఎస్పీ సైదా నాయక్ నేతృత్వంలో కమ్యూనిటీ కాంటాక్ట్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇంటిని తనిఖీలు చేశారు. కాలనీలో ఉంటున్న కుటుంబాల సమాచారాన్ని సేకరించారు. సోదాల్లో భాగంగా ఓ వ్యక్తి వద్ద ఎయిర్ గన్, దుప్పి కొమ్ములు లభించాయి. అలాగే సరైన పత్రాలు లేని 32 బైకులు, 14 ఆటోలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల నివారణ అందరి బాధ్యతని చెప్పారు. యువత గంజాయి, మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ద్విచక్ర వాహనదా రులు హెల్మెట్ ధరించాలన్నారు. ఎవరైనా భూకబ్జాలకు పాల్పడినా, భూ సంబంధిత గొడవల్లో పాల్గొని అమాయకులను మోసం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా జహీరాబాద్ పట్టణ శివారులోని పరిశ్రమల్లో పని కోసం వచ్చే వ్యక్తులకు గుర్తింపు కార్డు లేకుండా ఎవరు అద్దెకు ఇవ్వకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, ఎస్ఐలు వినయ్ కుమార్, కాశీనాథ్, రాజేందర్ రెడ్డి, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

