నిజాంపేట్ : కుటుంబాన్ని పోషించుకునేందుకు అంగవైకల్యం అడ్డుకాదని ఓ దివ్యాంగుడు నిరూపించాడు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన కిష్టాపూర్ గ్రామానికి చెందిన గైని పోచమ్మ, కాడయ్య దంపతులకు నాలుగో సంతానంగా గైని దేవదాస్ జన్మించాడు. ఆయన నాలుగో ఏట విధి వక్రించి పోలియో ప్రభావంతో కుడికాలు సచ్చుబడి పోయింది.
అంగవైకల్యాన్ని అధిగమించి దేవదాసు డిగ్రీ పూర్తి చేశాడు. ఎలాంటి ఉద్యోగ అవకాశం లభించలేదు. ఈ క్రమంలో తల్లిదండ్రులు అదే గ్రామానికి చెందిన కవితతో వివాహం చేశారు. వివాహం అనంతరం తల్లిదండ్రులు మృతిచెందడంతో దేవదాస్ కుటుంబపోషణ ప్రశ్నార్థకంగా మారింది. చివరికి తల్లిదండ్రులు సంపాదించిన వ్యవసాయ భూమిలో సేద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నట్లే అంగవైకల్యాన్ని అధిగమించి వ్యవసాయం చేస్తూ దిగుబడులు సాధిస్తున్నాడు. దేవదాసు ఆయన భార్య కవిత సాయంతో వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నాడు. సమాజంలో గౌరవంగా తల ఎత్తుకు తిరుగుతున్నాడు. ఇప్పటివరకు ప్రకృతి సహకరించి సకాలంలో వర్షాలు కురియడంతో వ్యవసాయం చేయగలిగానని దేవదాసు చెప్పారు. మొన్నటి వరకు నెలకొన్న వర్షాభావ పరిస్థితులవల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు వట్టిపోయాయని, సాగుచేసిన పంటలు ఎండిపోవడంతో వ్యవసాయం తట్టుకోలేక పోతున్నామని దేవదాస్, ఆయన భార్య కవిత వాపోయారు.
ఏటా పంటలు పండకపోవడంతో చేసిన అప్పులు కట్టలేక పోతున్నామని దేవదాసు దంపతులు ఆవేదన వ్యక్తంచేశారు. దేవదాసు దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారని, వారిని పోషించుకోవడం భారంగా మారిందని, అధికారులు, నాయకులు స్పందించి తగిన సాయం చేయాలని, జీతభత్యం వచ్చే ఏదైనా పనిలో దేవదాసును చేర్చుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.