Pyaranagar Dumping Yard | గుమ్మడిదల, మార్చి 30 : రాష్ట్ర ప్రజలంతా విశ్వావసు తెలుగు సంవత్సరాది ఉగాదిని సంతోషంగా నిర్వహించుకుంటుంటే ఇక్కడి గ్రామాల ప్రజలు మాత్రం ఉగాది పండుగను జరుపుకోకుండా డంపింగ్‌యార్డు(ఎంఎస్‌డబ్ల్యూ)కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేసి ఇక్కడి గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని రిలే నిరాహారదీక్ష చేశారు.
ఇవాళ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ సమీపంలో జీహెచ్ఎంసీ అధికారులతో రాంకీ సంస్థ నిర్మిస్తున్న డంపింగ్‌యార్డు(ఎంఎస్‌డబ్ల్యూ)ను రద్దు చేయాలని నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ గ్రామాల ప్రజలు 54వ రోజు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. కాగా నేడు ఉగాది కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగను నిర్వహించుకుంటుంటే.. ఈ గ్రామాల ప్రజలు మాత్రం మా గ్రామాల ప్రజలకు, భావితరం చిన్నారులకు న్యాయం జరగాలని ఆవేదనతో రిలే నిరాహారదీక్ష చేయడం చూస్తుంటే శత్రువుకైనా కన్నీరు రావలసిందే.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించదా..?
కానీ గత 54 రోజులుగా డంపింగ్‌యార్డును రద్దు చేయాలని దీక్షలు, ఆందోళనలు చేస్తున్నప్పటికి ఇప్పటి వరకు రాష్ట్రపాలకులు, జిల్లా యంత్రం కనీసం మానవతాదృక్పథంతో కూడా స్పందించకపోవడం విచారకరం. పండుగకు దూరమై ఆందోళనకు దగ్గరై ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రిలే నిరాహారదీక్షలో జేఏసీ నాయకులు, మహిళలు, గ్రామస్తులు మాట్లాడుతూ.. డంపింగ్‌యార్డు వల్ల మా గ్రామాల ప్రజలకు, వాతావరణానికి, భూగర్భజలాలకు, అడవిలోని వన్యప్రాణులకు హానీ పొంచి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి గ్రామాల ప్రజలన మనోవేదనను చూసైనా డంపింగ్‌యార్డు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కుమ్మరి ఆంజనేయులు, మన్నె రామకృష్ణ, కొరివి సురేశ్, రాజుగౌడ్, మహిళా జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.
gangula | వృత్తి విద్యా కోర్సులతో బంగారు భవిష్యత్
Collector Rahul Raj | దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్