మునిపల్లి, ఆగస్టు 08; దివ్యాంగుల పట్ల ప్రేమతో, జాలిగా మెలగాల్సిన ప్రభుత్వ ఉద్యోగి కర్కశంగా వ్యవహరించారు. పింఛన్ ఫారంపై సంతకం కోసం వెళ్లిన తండ్రీబిడ్డపై అంతెత్తున లేచి పడ్డాడు మునిపల్లి ఎంపీడీఓ. వికలాంగురాలైన తన కూతురు ఆసియా బేగం పింఛన్ ఫారం పై సంతకం కోసం వెళ్లిన ఖాజాపై ఉగ్రవరూపం చూపించారాయన.
కంకోల్ గ్రామానికి చెందిన ఆసియా బేగం సదరం సర్టిఫికెట్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకునేందుకు పింఛన్ ఫారంపై సంతకం కోసం తండ్రి ఖాజాతో కలిసి మునిపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లింది. అయితే.. చిన్నారి తండ్రి కాజాను ఎంపీడీవో ఇష్టానుసారంగా బూతులు తిట్టడమే కాకుండా కార్యాలయం నుంచి బయటకు పంపించినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.
‘సంతకం కోసం ఎంపీడీవో కార్యాలయంలోకి పోతే.. మిమ్మల్ని ఎవరురా లోపలికి పంపింది. సంతకం పెట్ట…ఏం..పెట్ట ఏం చేసుకుంటావో చేసుకో.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో’ అని దివ్యాంగురాలి తండ్రిపై తిట్లదండకం అందుకున్న ఎంపీడీఓ తన ఛాంబర్ నుంచి బయటకు పంపించినట్లు బాధితులు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ సంతకం కోసం వచ్చిన తండ్రీకూతురుతో దురుసుగా ప్రవర్తించిన ఎంపీడీఓపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పింఛన్ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.