మెదక్ అర్బన్, ఏప్రిల్ 15: మెదక్ జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతున్నది. ఒకప్పుడు పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ ఇప్పుడు మారుమూల గ్రామాలకు సైతం విస్తరించింది. ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 15 బెట్టింగ్‌కు వేదికగా మారింది. జిల్లాలో హవేళీ ఘణపూర్, మెదక్, పాపన్నపేట, నర్సాపూర్, కౌడిపల్లి, రామాయంపేట, తూప్రాన్, మండలంతో పాటు ప్రధాన పట్టణాల్లో సైతం బెట్టింగ్ జోరుగా సాగుతున్నట్లు సమాచారం.
బంతి.. బంతికి బెట్
జిల్లా నలుమూలల నుంచి బెట్టింగ్ ముఠా బృందాలగా ఏర్పడుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకుంటూ యవతను ఆకర్షిస్తున్నాయి. ఎవరికి తెలియని రిమోట్ ప్రాంతాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఐపీఎల్లో భాగంగా ఏ రోజు ఏ టీం గెలుస్తుంది? ఎన్ని పరుగులు చేస్తుంది? ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు? తర్వాత బాల్ సిక్సా? పోరా? అనే అంశాలపై బెట్ కాస్తున్నాయి. బెట్టింగ్ ముఠా పరుగు, పరుగుకు ఒక రేటు, బంతి, బంతికి ఒక రేటు, వికెట్, టాస్, ఇలా ప్రతి అంశానికో రేటు నిర్ణయిస్తున్నట్లు సమాచారం. ఈ బెట్లు రూ. 100నుంచి మొదలుకొని రూ. లక్షలు దాటుతున్నవి. కొన్ని బెట్టింగ్ ముఠాలు యువకుల నుంచి రూ. 100 బెట్టింగ్ పెట్టిస్తూ వారు గెలిస్తే రూ. వెయ్యి వరకు ఇస్తున్నట్లు సమాచారం. అయితే రూ. 100ఎక్కువ మంది బెట్ కాయడం తక్కువ మంది గెలుస్తుండటంతో బెట్టింగ్ ముఠాలకు కలిసి వస్తుంది.
అంతాకోడ్ భాషే…
బెట్టింగ్‌లకు ఎక్కువ మంది మొబైల్‌ను వినియోగిస్తున్నారు. ఎవరితో బెట్టింగ్ చేయదలచుకుంటున్నారో వారికి సామాజిక మాధ్యమాలు, మెసెంజర్ల ద్వారా సమాచారం ఇచ్చుకుంటున్నారు. బెట్టింగ్ విషయం బయటకు రాకుండా కోడ్ భాషను వినియోగిస్తున్నారు. పోలీసులకు చిక్కవద్దనే ఉద్దేశంతో కొత్త భాషను సృష్టిస్తున్నారు. బెట్టింగ్‌ల ద్వారా బుకీలకు లాభం చేకురుతుండగా పేద, మధ్యతరగతి చెందిన యువకులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఈజీ మనీకి అలవాటుపడి జీవితాలను చిద్రం చేసుకుంటున్నారు.
బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు
ఐపీఎల్లో బెట్టింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పీఎస్ గేమ్యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. బెట్టింగ్ పెట్టినట్టు ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియాజేయాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగ ఉంచబడుతాయి. బెట్టింగ్ పెట్టినట్లు మీ దృష్టికి వస్తే 9490617007, 9490617045లకు సమాచారం అందించవచ్చు.
– సైదులు, మెదక్ డీఎస్పీ