జహీరాబాద్, మార్చి 17: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జహీరాబాద్లోని రాచన్నపేటలో ఉన్న గురుకృప సామిల్ (కట్టెల మిషన్లో) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి సామిల్ మొత్తానికి వ్యాప్తిచెందడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో మిల్లులోని మెషిన్లు, సామాగ్రి మొత్తం కాలిబూడిదయ్యాయి. పక్కనే ఉన్న ఓ దుకాణానికి మంటలు వ్యాపించడంతో ద్విచక్ర వాహనం కూడా దగ్ధమయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపుచేశారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నేత నామా రవి కిరణ్ తోపాటు విద్యుత్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఈ ఘటన వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు కార్పెంటర్ మారుతి తెలిపారు. సామిల్లో కూడా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.