చౌటకూర్, ఫిబ్రవరి 18: చౌటకూర్ మండలం చక్రియాల గ్రామంలో వెలసిన శ్రీ లక్షీ అనంత పద్మనాభ స్వామి ఆలయ పూజారిని తొలగించాలని కోరుతూ ఆ గ్రామస్తులు ఏకగ్రీంగా తీర్మానించారు. మంగళవారం ఆలయ మంటపంలో సమావేశమై పూజారి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. ప్రతీ రోజు స్వామి వారికి ధూప, దీప నైవేద్యం ఆరాధన చేయాల్సిన పూజారి వేళాపాళ లేకుండా చుట్టపుచూపుగా ఆలయానికి వస్తున్నారని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం గ్రామస్తుల సంతకాలతో కూడిన ప్రతులతో జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
స్వామి వారికి నిత్య పూజలు చేయని ఈ పూజారి తమకు ఎంతమాత్రం వద్దంటూ ప్రజలంతా ముక్తకంఠంతో ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంత పద్మనాభ స్వామికి చెందిన 8 ఎకరాల దేవుని మాన్యం భూమిని అనుభవిస్తున్నారని, అయినా స్వామి వారికి పూజలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఏ మాత్రం అందుబాటులో ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారని మండిపడ్డారు.
దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజలకు అందుబాటులో లేని పూజారిని తొలగించి, కొత్త పూజారిని నియమించాలని వారు కోరారు. పిర్యాదు చేసిన వారిలో ఆలయ కమిటీ చైర్మన్ భానూరి లక్ష్మయ్య, మాజీ చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, రోళ్లపాటి పండరి, డైరెక్టర్లు రోళ్లపాటి సత్యనారాయణ, అంజిరెడ్డి, మన్నె నర్సింలు, గ్రామ పెద్దలు చిన్నరోళ్ల పాటి రాజశేఖర్, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.