పుల్కల్, మార్చి 4: సంగారెడ్డి జిల్లాలోని ఉమ్మడి పుల్కల్ (Pulkal) మండల పరిధిలో బోర్లను నమ్ముకుని వరి నాట్లు వేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. లో వోల్టేజీ కారణంగా మోటర్లు కాలిపోవడంతో యాసంగికి సాగు నీరందక రైతులు విలవిల్లాడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో సమయానికి నీరందక పంటలు ఎండిపోయి ఎడారిలా కనబడుతున్నాయి. గత ప్రభుత్వ హయంలో వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్న రైతులు నేడు దిక్కుతోచని స్థితిలో పడి పోయారు. గతంలో సింగూరు ఎడమ కాలువ ద్వార 44 వేల ఎకరాలకు సాగు నీరందిస్తే, నేడు సీసీ లైనింగ్ పేరుతో యాసంగి పంటలకు నీటిని వదలకుండా కాలాయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పదేండ్లుగా ఎన్నడూ ఈ దుస్థితి రాలేదని రైతులు వాపోతున్నారు.
ఉమ్మడి పుల్కల్ మండలంలో 20 వేల ఎకరాలకు మించి వరి నాట్లు వేసే రైతులు నేడు 16 వేల ఎకరాల లోనే సాగు చేస్తుండటం విశేషం. సింగూరు అంటేనే పచ్చని పంటలకు పెట్టింది పేరు కాని అందుకు విరుద్దంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రైతుల వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇచ్చిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ లోనే పుష్కలంగా పంటలు పండించుకున్నామని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు తప్ప మరేమి లేదన్నారు. లో వోల్టేజీ కరెంటుతో మోటర్లు కాలిపోతున్నా ప్రభుత్వం పట్టించు కోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. అందోల్ నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రత్యేక చొరవ చూపించి సింగూరు కాలువ సీసీ లైనింగ్ పనులు త్వరగతిన పూర్తయ్యేలా చొరవ చూపించాలని రైతులు వాపోతున్నారు.