మునిపల్లి, ఆగస్టు 9: గత ప్రభుత్వ హయాంలో హాస్టళ్లలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులుకు (Hostel Students) నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన భోజనం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైపోయింది. దీంతో బుదేరా మహిళ డిగ్రీ రెషిడెన్సీయల్ హాస్టళ్ళల్లో సంబంధిత ప్రిన్సిపాల్ ఇష్టరాజ్యంతో విద్యార్థులకు రుచికరమైన భోజనాలు కరువయ్యాయి. మునిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తాలో గల తెలంగాణ మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థులకు పురుగుల అన్నమే పరమాన్నం మాదిరిగా వడ్డిస్తున్నా పట్టించుకునే వారే లేరా అని పలు సంఘాల నాయకులు అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. విద్యార్థులకు రుచికరమైన భోజనాలు పెడుతున్నారా లేదా అని పలు సంఘాల నాయకులు మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్‌కు వెళ్లి తనిఖీలు చేపడుతుండగా వారిపై ప్రిన్సిపల్ దురుసుగా మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లోకి రావాలంటే జిల్లా కలెక్టర్ అనుమతి ఉండాలి. అలాకాకుండా లోపలోకి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హాస్టల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చెప్పిన వారిపై కూడా ప్రిన్సిపాల్ కక్ష గట్టి ఇబ్బందూలకు గురి చేస్తున్నట్లు సంఘాల నాయకుల దృష్టికి విద్యార్థులు తీసుకువచ్చారు. విద్యార్థుల బాగుగోలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నా స్థానిక ప్రిన్సిపాల్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి
విదుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న బుదేరా మహిళా డిగ్రీ రెసిడెన్సీయల్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని మండలంలోని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్లో రుచికరమైన భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.