జహీరాబాద్, మార్చి 20: డీజిల్ అక్రమ రవాణాతో (Illegal Diesel Sale) దళారులకు కాసుల పంట పండుతోంది. రాష్ట్రాల సరిహద్దు జిల్లాల కేంద్రంగా ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. అక్రమ రవాణాను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆటగా సాగుతున్నది. తెలంగాణ సరిహద్దుల్లో డీజిల్ బంకులు మూతపడటం, కర్ణాటకలో డీజిల్ ధర ఇక్కడి కంటే తక్కువగా ఉండటంతో.. రాజకీయ అండదండలున్న అక్రమార్కులు అక్కడి నుంచి డీజిల్ తీసుకొచ్చి, ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్-ముంబై ప్రధాన జాతీయ రహదారి మీదుగా జిల్లాల్లో సాగుతున్న ఈ దందాలో దళారులు, పెట్రోలియం వ్యాపారులు, కర్ణాటకకు చెందిన కొందరు దళాతులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తున్నది. వీరికి రాజకీయ పలుకుబడి, పోలీసుల మద్దతు, అధికారుల అండదండలు లభించడంతో దందా నిర్విఘ్నంగా కొనసాగుతోందని సమాచారం.
రాజకీయ పలుకుబడితో దళారులు తమ ట్యాంకర్ల ద్వారా నిత్యం కర్ణాటక నుంచి అక్రమంగా డీజిల్ తెచ్చి, ఇక్కడ అమ్ముకుంటున్నారు. డీజిల్ ధర తెలంగాణ కంటే కర్ణాటకలో సుమారు రూ.7 తక్కువగా ఉంది. దాంతో బంకుల నిర్వాహకులు అధిక సంపాదన కోసం ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. కర్ణాటకలోని సరిహద్దు ప్రాంతాల్లోని బంకుల నుంచి డీజిల్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నట్లు తెలిసింది. కర్ణాటకలో తెలంగాణలో కంటే తక్కువ ధరకు డీజిల్ దొరకడంతో తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని పలు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి.
హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై ఉన్న తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో దళారులు లారీల నుంచి డీజిల్ సేకరణ చేపడుతున్నారు ఒకవైపు బడాబాబులు రాజకీయ పలుకుబడి, అధికార వర్గాల మద్దతుతో అక్రమార్కులు ఏకంగా ట్యాంకర్ల కొద్దీ డీజిల్‌ను దొడ్డిదారిన తరలించి కాసులు సంపాదిస్తుంటే, మరోవైపు లారీల డ్రైవర్లతో స్నేహం ముసుగులో దళారులు డీజిల్ సేకరించి అమ్ముకుం టున్నారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని మాడిగి శివారులో కొందరు దళారులు ఈ దందా సాగిస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చే లారీల డ్రైవర్లతో స్నేహం చేయడం ద్వారా ఆ లారీల డ్రైవర్లు కర్ణాటకలో తమ డీజిల్ ట్యాంకులు నింపుకొని ఇవతలకు వచ్చాక, ఈ దళారికి వారి లారీల్లోని డీజిల్‌ను తక్కువ ధరకు అమ్ముతున్నారు.
ఓనర్ల పర్యవేక్షణ, జీపీఎస్ ఉన్న వాహనాల డ్రైవర్లు అక్కడి నుంచి తెచ్చే అదనపు డీజిల్‌ని మాత్రమే వీరికి విక్రయిస్తుంటే, ఈ పర్యవేక్షణ లేని వాహనాల డ్రైవర్లు మాత్రం ఏకంగా లీటర్ రూ.75 నుంచి రూ.80 లోపే ఇతనికి అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. దళారులు నిత్యం వందల లీటర్ల పైచిలుకు డీజిల్‌ను ఇలా లారీల నుంచి తక్కువ ధరకు కొని, ఇక్కడి ట్రాక్టర్లకు, ఆటోలకు ఇక్కడి ధరకు అమ్ముకుంటూ కాసులు కూడబెట్టు కుంటున్నాడు. మామూళ్లు అందు తుండడంతో ఎవరికి వారు ఈ దందాను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది.